ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 2: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు ఏం ఒరుగుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రశ్నించారు. నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకే కాంగ్రెస్ సర్కారు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిందని మండిపడ్డారు. క్యాలెండర్లో ఉద్యోగ ఖాళీల గురించి లేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన రాహుల్‌గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ ఎన్సీసీ గేటు ఎదుట రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాలెండర్లో పరీక్ష తేదీలు, అర్హతలు తప్ప మరేవీ లేవని, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా దీన్ని విడుదల చేసినట్టు తెలుస్తున్నదని విమర్శించారు. నిరుద్యోగులను తమ రాజకీయాలకు బలిచేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్, శిగ వెంకటేశ్ గౌడ్, జంగయ్య, కాటం శివ, నాగేందర్, అవినాశ్, మిథున్ ప్రసాద్, రామకృష్ణ, ప్రశాంత్‌గౌడ్, వెంకటేశ్, కొంపల్లి నరేశ్, పవన్, రాకేశ్, సాయి, సందీప్, వంశీ పాల్గొన్నారు.