హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుతోనే ఏపీ తలపెట్టిన గోదావరి-నల్లమలసాగర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, ఇది ముమ్మాటికీ తెలంగాణకు ద్రోహం చేయడమేనని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. ఎన్నో ప్రెస్మీట్లు పెట్టి, ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించకపోవడం వల్లే ఐఐసీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్టుకు టెండర్ ఖరారు అయిందంటూ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఏపీ సర్కార్ నల్లమలసాగర్‌కు సంబంధించి 2025 డిసెంబర్ 11న చివరి తేదీతో టెండర్ వేస్తే టెండర్ చివరి తేదీ అయిపోయాక డిసెంబర్ 16 నాడు రేవంత్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లడమంటే ఆ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపేందుకేనని స్పష్టమైందని మండిపడ్డారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి డీపీఆర్‌ను ఆపేందుకు స్టే తెచ్చి ఉంటే టెండర్ ఖరారయ్యేదే కాదని స్పష్టంచేశారు.
ఏపీకి రేవంత్ పరోక్ష సహకారం
రేవంత్‌రెడ్డి పరోక్ష సహకారం వల్లే నీటి వాటా దకకుండా పోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. 2025 జూలై 16న ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశంలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబు అంగీకరించిన విధంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 15న కమిటీ వేస్తే, తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 23న కమిటీ వేసిందని గుర్తుచేశారు. ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లతో కేంద్ర ప్రభుత్వ అధికారులను చేర్చి నేడు తెలంగాణ, ఏపీల మధ్య నీటి వాటా పంపిణీకై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కమిటీ ఖరారు చేసిందని తెలిపారు. ఏపీ కమిటీలో ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు ఇంజినీర్లు ఉంటే తెలంగాణ కమిటీలో ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఇంజినీరింగ్ అధికారి మాత్రమే ఉన్నారని తెలిపారు. ఏపీ కమిటీలో ఐఎస్అండ్డబ్ల్యూఆర్లో అనుభవం ఉన్న అధికారి ఉంటే తెలంగాణ కమిటీలో ఐఎస్అండ్డబ్ల్యూఆర్లో అనుభవం లేని అధికారి ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కమిటీ ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు మూడు నెలల్లో పూర్తి చేయడం అంటే మూడు నెలల్లో నల్లమల సాగర్‌కు ఆమోదం తెలుపడమేనని హెచ్చరించారు. ఇది రేవంత్‌రెడ్డి ఉద్దేశ పూర్వకంగా తెలంగాణకు నష్టంచేసి ఏపీకి మేలు చేసే చర్యగా ఆరోపించారు.