సంగారెడ్డి, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) : తెలంగాణకు ఏకైక గొంతుక.. రాష్ట్ర ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ బొనిగె పిసికేందుకు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తమ సైన్యంతో తరలివస్తున్నారని, ఎంతమంది బబ్బర్‌షేర్లు..తీస్మార్ఖాన్లు వచ్చినా తాము భయపడేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం, బహిరంగ సభ జరిగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ను దెబ్బకొట్టేందుకు ఒకదిక్కు నుంచి ప్రధాని మోదీ, అమిత్‌షా, 15 మంది బీజేపీ సీఎంలు, 15 మంది కేంద్రమంత్రులు వస్తున్నట్టు చెప్పారు. మరో దిక్కు నుంచి సోనియా, రాహుల్, మల్లికార్జున్‌ఖర్గే, సిద్ధరామయ్య తెలంగాణ వస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ వందసీట్లతో గెలిస్తే మౌనంగా కూర్చోడని.. మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రవేశించి బీజేపీ, కాంగ్రెస్‌ను ఓడిస్తారని తెలిసి మోదీ, రాహుల్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కరెంటు కనబడడం లేదన్న రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డికి తాను బంపరాఫర్ ఇస్తున్నానని, తాము ఏర్పాటు చేసిన ఏసీ బస్సులో సంగారెడ్డి నియోజకవర్గంలోని ఏదో ఒక ఊరుకు వెళ్లి వైర్లు పట్టుకుంటే కరెంటు ఉందో? లేదో తెలుస్తుందని అన్నారు. ఇన్వెర్టర్ల గబ్బు తెచ్చిన కాంగ్రెస్ కరెంటు గురించి మాట్లాడుతుంటే బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతులు, ప్రజలకు కరెంటు కష్టాలు తప్పవని హెచ్చరించారు. వారు ఏం చేశారని మరో చాన్స్ ఇవ్వాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ కావాలో? కరెంటు కావాలో? తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.
సంగారెడ్డిలో బుధవారం మంత్రి కేటీఆర్ రోడ్‌షో విజయవంతమైంది. ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వేలాదిమంది యువకులు, విద్యార్థులు రోడ్‌షోలో పాలుపంచుకున్నారు. సంగారెడ్డి మండలం కంది నుంచి ప్రారంభమైన రోడ్‌షో సంగారెడ్డిలోని పాతబస్టాండు వరకు కొనసాగింది. వేలాదిమంది యువకులు, కార్యకర్తలు బైక్‌లతో ర్యాలీలో పాల్గొన్నారు. జై కేటీఆర్..జై కేసీఆర్ నినాదాలతో సంగారెడ్డి మార్మోగింది.
తనను గెలిపిస్తే బీఆర్ఎస్లోకి వెళ్తానని సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చెప్పుకోవడం సరికాదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేసే చింతా ప్రభాకర్ ఉండగా జగ్గారెడ్డిని ఎందుకు తీసుకుంటామని ప్రశ్నించారు. ప్రజలకోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్న చింతా ప్రభాకర్‌ను గెలిపించాలని కోరారు. ఆయనను గెలిపిస్తే సంగారెడ్డికి మెట్రోరైలు, ఐటీహబ్ వస్తాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మామిళ్ల రాజేందర్, మాణిక్యం, ముకీమ్, హకీం, కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, బొంగుల విజయలక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో ముస్లింలు ఆగం కావొద్దని, ఆవేశంగా నిర్ణయానికి వచ్చి ఓటు వేయొద్దని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముస్లిం సంక్షేమానికి కట్టుబడిన కేసీఆర్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు. సంగారెడ్డి సభలో మంత్రి కేటీఆర్ 10 నిమిషాలకు పైగా ఉర్దూలో అనర్గళంగా ప్రసంగించారు. సభా వేదిక పక్కనే ఉన్న మసీదు నుంచి ఆజాన్ వినిపించగానే ఐదు నిమిషాల పాటు తన ప్రసంగాన్ని నిలిపివేశారు. రాష్ట్రంలో తొమ్మిదన్నరేండ్లుగా శాంతియుత వాతావరణం నెలకొన్నదని, మతం పేరుతో కేసీఆర్ ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 లక్షలు ఉన్న ముస్లిం జనాభా సంక్షేమం కోసం కేసీఆర్ రూ.2100 కోట్లు ఖర్చు చేశారని, అలాంటి కేసీఆర్‌ను కాపాడుకునే బాధ్యత ముస్లింలపై ఉన్నదని అన్నారు.