Y Satish Reddy | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి తెలంగాణ రెయిజింగ్ అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ రాష్ట్రాన్ని మాత్రం తిరోగమన దిశలో తీసుకెళ్తున్నారు అని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగమే దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యుత్ వినియోగం ఏటా 10 నుంచి 20 శాతం పెరుగుతూ పోతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో అలాగే పెరుగుతూ పోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. విద్యుత్ వినియోగం నానాటికి తగ్గుతూ పోతోంది. 2024తో పోలిసతే 2025లో భారీగా విద్యుత్ వినియోగం తగ్గింది. 2024 మే 1న 10,879 మెగావాట్ల వినియోగం జరిగితే 2025 మే 1 న 9,811 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. అంటే 1068 మెగావాట్లు తగ్గింది అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక గతేడాది మే 2 న 10,218 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగితే ఈ ఏడాది అది 9877 మెగావాట్లకు పడిపోయింది. అంటే 341 మెగావాట్లు తగ్గిం. గతేడాది మే 3న 9,290 మెగవాట్ల విద్యుత్ వినియోగించగా.. ఈ సారి అది 8510 మెగవాట్లకు పడిపోయింది. అంటే 780 మెగావాట్లు తగ్గింది. ఇలా రోజు రోజుకు విద్యుత్ వినియోగం తగ్గుతూ పోతోంది. కాంగ్రెస్ విధానాలతో కొత్త పరిశ్రమలు రావడం లేదు. కాంగ్రెస్ కమీషన్ల కక్కుర్తితో ఉన్న కంపెనీలు కూడా మనుగడ సాగించే పరిస్థితి లేకుండా పోయింది. కరెంటు కోతలు మొదలయ్యాయి. నిర్మాణ రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. హైడ్రా దెబ్బకు రియల్ ఎస్టేట్‌తో సహా నిర్మాణ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలంటే రియల్టర్లు… వాటిని కొనాలంటే ప్రజలు బయపడే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుసంక్షేమ పథకాలను బందుపెట్టి.. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది. దీంతో మళ్లీ పొలాలు బీడుబారుతున్నాయి సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వైపు కాంగ్రెస్ నాయకులేమో తెలంగాణ రెయిజింగ్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం తెలంగాణ ఫాలింగ్ అని.. తెలంగాణ కుప్పకూలుతోందని స్పష్టం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రాన్ని ఇలా తిరోగమన దిశలోకి తీసుకెళుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ.. ప్రతీదానికి బీఆర్ఎస్ ను బూచిగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ కాంగ్రెస్ తప్పులు లెక్కలతో సహా కనిపిస్తున్నాయి. తెలంగాణ తిరోగమనంలోకి వెళ్లిపోతోందని.. మళ్లీ సమైక్య రాష్ట్రంలో చూసిన చిమ్మచీకటి రోజులు రావడానికి ఎన్నో రోజులు పట్టేలా లేదనేది కూడా అర్థమవుతోంది. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు.. కాంగ్రెస్ అంటేనే కన్నీళ్లు.. కాంగ్రెస్ అంటేనే కష్టాలు అనేది మరోసారి రుజువు అవుతోంది. వీటన్నింటికి ప్రజలు తప్పకుండా సమాధానం చెబుతారు. కాలనాగులా తెలంగాణను కాటేస్తున్నా కాంగ్రెస్ తలమీద కొట్టి పాతాళంలో పాతిపెట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు.