KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో పల్లెలన్నీ ధ్వంసమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. పల్లెలను పట్టించుకునే నాథుడు లేడు అని విమర్శించారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో నెలకొన్న సమస్యలపై కేటీఆర్ స్పందించారు.
అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు.. అన్న చందంగా కాంగ్రెస్ పాలన ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పల్లెలు నాడు కేసీఆర్ పాలనలో ప్రగతి బాట పడితే.. నేడు 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట పట్టాయన్నారు. 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్రం నుండి నిధులు ఆగిపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
12,754 గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. నాడు పచ్చబడ్డ పల్లెలు.. నేడు ఎండుతున్నాయి. తాగునీటికి గోస వచ్చిందన్నారు. వీధి దీపాలు వెలగడం లేదన్నారు. హరితహారం మొక్కల హాహాకారాలు.. పంచాయతీల నిర్వహణకు కార్యదర్శుల ఆపసోపాలు పాడుతున్నారని పేర్కొన్నారు.
నాడు గ్రామాల కోసం పల్లె ప్రగతి.. పట్టణాల కోసం పట్టణ ప్రగతి నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. హరితహారంలో మొక్కలు నాటించి గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణ, మొక్కల సంరక్షణకు ట్రాక్టర్ల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో దేశానికే అదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్న తెలంగాణ పల్లెలు.. నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యంతో నిధులు లేక వెల వెలబోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ నినదించారు.