KTR | హైదరాబాద్ : నెగెటివ్ పాలిటిక్స్‌తో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో విఫలమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖతమై పోయే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారందరికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైడ్రాతో ఆస్తులు కాపాడుతాం అంటున్నారు. చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచందర్ రావు, తిరుపతి రెడ్డి ఇండ్లను ముట్టరు. ఇక అలకగా దొరికే గరీబోన్నీ పైకి బుల్డోజర్లు పంపుతున్నారు. 24 గంటలు నెగెటివ్ పనులేనా.. పాజిటివ్ పనులు చేయరా..? అని కేటీఆర్ నిలదీశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మైండ్ స్పెస్ నుంచి శంషాబాద్ వరకు ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ పెడితే.. రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారని అధికారులను అడిగితే.. మీ భూములు ఉన్నాయని రద్దు చేసినట్లు చెప్పారు. భూములు ఉన్నట్టు కూడా నాకు తెలియదు. శంకుస్థాపన జరిగాక కూడా రద్దు చేశారు. తక్కువ ఖర్చుతో సౌలభ్యం మెరుగుపడుతది అని ఆలోచించి ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేశాం. ఫార్మా సిటీ రద్దు అంటూ ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ సిటీ నడుపుతున్నారు. ఇంకో దిక్కు మూసీ అంటరు. కానీ రైతుబంధు, తులం బంగారం, రుణమాఫీ, స్కూటీలకు పైసల్లేవు. స్కాలర్షిప్లు కూడా లేవు. కానీ మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు ఇస్తారట. మింగేతందుకు మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట.. ఫోజులు ఎందుకు..? అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఆహా నా పెళ్లాంట సినిమాలోని కోడి కూర సీన్ మాదిరి రేవంత్ పాలన ఉంది అని కేటీఆర్ విమర్శించారు. కొత్త రేషన్ కార్డులు అని ఏడాదిన్నరగా సాగుతోంది. కోటి మందితో దరఖాస్తులు పెట్టించారు. ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నెగెటివ్ పాలిటిక్స్‌తో పూర్తిగా విఫలమైంది. పేదవాడి మీద ప్రతాపం చూపెట్టి కాంగ్రెస్ పార్టీ ఖతైమ పోయే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ పేర్కొన్నారు.