KTR : బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తిచేసుకుని 25వ ఏడులోకి అడుగుపెట్టబోతున్నదని, ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితి గురించి చెప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మూలకు పోయి ఏ రైతును పలుకరించినా గుడ్లల్లకెళ్లి నీళ్లు దిరుగుతున్నయని, బాధపడుతున్నరని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండనని, ఇప్పుడు బతుకులు అన్యాయమై పోతున్నయని చెబుతున్నరని తెలిపారు.
రైతులే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎవరిని పలుకరించినా బాధ వ్యక్తం చేస్తున్నరని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పెట్టే బాధలు చూసి ఇప్పుడు అందరికీ కేసీఆర్ గుర్తుకొస్తున్నరని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధుకు రాంరాం చెప్తరని కేసీఆర్ ముందే చెప్పారుని, అయినా వినిపించుకోలేదని అన్నారు. కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెప్పినా ఓట్లేసిండ్రని, ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ రాజ్యమనే సంగతి మర్చిపోయినట్టున్నరని వ్యాఖ్యానించారు.
ఒక్కటి మాత్రం వాస్తవమని ప్రజలకు ఏ కష్టమొచ్చినా, ఏ దుఃఖమొచ్చినా గుర్తుకొస్తున్నది కేసీఆరేనని కేటీఆర్ అన్నారు. ఆటోడ్రైవర్లు కేసీఆర్ను గుర్తుచేసుకుంటున్నరని చెప్పారు. ఉద్యోగులు కేసీఆర్ పెంచిన జీతాలను యాదిజేసుకుంటున్నరని తెలిపారు. నిరుద్యోగులు కేసీఆర్ను గుర్తుచేసుకుంటున్నరని అన్నారు. కాంగ్రెస్కు ఓటేసినందుకు తప్పైపోయిందని చెప్తున్నరని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతిబిడ్డ మళ్లీ ఓట్లు ఎప్పుడొస్తయా, గులాబీ జెండాకు ఎప్పుడు పట్టం కడుదామా అని ఎదురుచూస్తున్నరని చెప్పారు.