KTR | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన యువకుడిని పోలీసులు రాత్రివేళ ఇంట్లోకి చొరబడి అరాచకం సృష్టించి అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారు కరడుగట్టిన నేరగాడిని పట్టుకున్నట్టు, రాత్రి వేళ తలుపులు బద్దలుకొట్టి, తినే అన్నం నేలకు కొట్టినట్టుగా వ్యవహరించి అరెస్ట్టు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నిత్యం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కండ్లకు తెలంగాణలో అమలవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ కానరావడం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ చర్యలు ఆయన చెవికి వినపడటం లేదా? అని నిలదీశారు. ‘కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేదా? చెరసాలకు భయపడితే తెలంగాణ వచ్చేదా?’ అని మంగళవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
అతను ఎవరి మీదా దాడి చేయలే
‘అతను హత్య చేయలేదు.. అతను దొంగతనం చేయలేదు.. అతను ఎవరి మీదా దాడి చేయలేదు.. అతను తీవ్రవాది కాదు.. అతను మావోయిస్టు కాదు.. అతను మావోయిస్టుల సానుభూతిపరుడు కూడా కాదు.. అతను మాజీ నేరస్థుడు కానే కాదు.. అతను శాంతిభద్రతలకు ఎకడా విఘాతం కలిగించలేదు.. అతను శాంతిభద్రతలు భంగం కలిగించేలా ఎవరినీ రెచ్చగొట్టలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తున్నడు.. హామీల అమలు గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను రీపోస్ట్ చేస్తున్నాడు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కరడుగట్టిన నేరగాడిని పట్టుకున్నట్టు రాత్రి వేళ తలుపులు పగలగొట్టి అరెస్ట్టు చేసింది.
హత్యాయత్నం చేసిన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి ఎకడ తన పలుకుబడిని ఉపయోగించి సాక్ష్యాలను మాయం చేస్తాడో అన్నట్టు, సాక్షులను ప్రభావితం చేస్తాడో అన్నట్టు.. ఎవరినీ కలవనివ్వకుండా పారిపోతాడన్నట్టు.. పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నిత్యం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్‌గాంధీ.. తెలంగాణలో అమలవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ మీ కండ్లకు కనిపించడం లేదా? మీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ చర్యలు మీ చెవికి వినపడడం లేదా?’ అని నిలదీశారు. ‘ప్రజల తరఫున ప్రశ్నిస్తం. హామీల అమలుపై నిలదీస్తం’ అని స్పష్టంచేశారు.