గురుగ్రామ్ : ఆటల మీద ఆసక్తి ఉండి దానినే కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు తెలిపింది. క్రీడల్లో ఒక్క గాయంతో కెరీర్లు కోల్పోతాయని, కానీ చదువు మాత్రం నిత్యం మనతోనే ఉంటుందని చెప్పింది. గురుగ్రామ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సింధు మాట్లాడుతూ.. ‘నేను చాలాకాలంగా బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. ఏదో ఒక సమయంలో మనం (క్రీడాకారులు) రిటైర్ అవ్వాల్సిందే. అది ఎవరూ కాదనలేని వాస్తవం.
45, 50 ఏండ్లు వచ్చాక అత్యున్నత స్థాయిలో ఆడటం చాలా కష్టం. ఎవ్వరైనా దానిని అంగీకరించాల్సిందే. కానీ చదువు అలా కాదు. జీవితాంతం అది మనతోనే మనకు తోడుగా ఉంటుంది. క్రీడలతో పాటు విద్యాబ్యాసమూ ముఖ్యమే. నేను ఆటను కొనసాగిస్తూనే ఎంబీఏ పూర్తిచేశా. ఉదయం ట్రైనింగ్, మధ్యాహ్నం చదువు, మళ్లీ సాయంత్రం ట్రైనింగ్.. ఇది కష్టంతో కూడుకున్నదే అయినా చదువును నిర్లక్ష్యం చేయలేదు. జీవితంలో క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడం మంచి విషయమే. కానీ చదువును ఆపొద్దు. ఎందుకంటే క్రీడల్లో ఒకసారి పెద్ద గాయమైతే మన కెరీర్ ముగిసినట్టే!’ అని తెలిపింది.