KTR | తెలంగాణలో రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఆ లేఖలో పొందుపరిచారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు.. కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. 40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్ల రుణమాఫీతో రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేయాలని తన లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరఫున కాంగ్రెస్ పార్టీపై పోరాడతామని ఆ లేఖ ద్వారా హెచ్చరించారు.
గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారికి…
మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాకం వలన దగా పడిన లక్షలాది మంది తెలంగాణ రైతుల తరఫున మీకు ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలతో ముఖ్యంగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ మోసం వలన లక్షలాదిమంది రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు విడుదల చేసిన హామీలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది అత్యంత కీలకమైన అంశం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను.
అబద్ధాలు, అభూతకల్పనలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రెండులక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన సీఎం రేవంత్.. మూడు విడతలుగా మోసంచేస్తూ.. ఎనిమిది నెలలుగా ఊరించి ఊరించి చివరికి రైతులను ఉసూరుమనిపించారు. కనీసం 40 శాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండానే వందశాతం రుణమాఫీ పూర్తయిపోయిందని ప్రకటించడం వందకు వందశాతం అబద్ధం. అందుకే తెలంగాణలో రుణమాఫీ పేరిట జరిగిన నయవంచనకు సంబంధించిన లెక్కలు మీకు తెలుసో లేదో అనే ఉద్దేశంతో సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఈ లేఖలో పొందుపరుస్తున్నాను.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షరూపాయల రుణమాఫీ చేస్తేనే 17 వేల కోట్లు ఖర్చయింది. ఏకంగా 36 లక్షల మంది రైతులు రుణవిముక్తులై లబ్ది చేకూరింది. కాంగ్రెస్ చెబుతున్నట్టు రెండు లక్షల రుణమాఫీ పూర్తయితే.. లబ్దిదారుల సంఖ్యతోపాటు రుణమాఫీ మొత్తం పెరగాలి, దాదాపు రెట్టింపు కావాలి. కానీ కేవలం 17,900 కోట్లతో రెండు లక్షల రుణమాఫీని పూర్తిచేశామనడం ముఖ్యమంత్రి డొల్లవాదనకు నిదర్శనం. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి తూతూమంత్రంగా చేయడం.. కాంగ్రెస్ సర్కారు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.
అసలు లక్ష రూపాయల రుణమాఫీ కన్నా.. రెండు లక్షల రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 14 లక్షలు తగ్గడం రైతు రుణమాఫీ ఏ మేరకు విఫలమైందో అద్దం పడుతుంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లెక్క ప్రకారం రెండు లక్షల రుణమాఫీకి 49,500 కోట్లు అంచనా వేశారు. ముఖ్యమంత్రే స్వయంగా రుణమాఫీకి 40వేల కోట్ల వరకు అవుతుందని తొలుత చెప్పుకొచ్చారు. కడుపు కట్టుకుంటే.. ఇది పెద్ద విషయం కాదని ఇంటర్వ్యూల్లో గొప్పలు చెప్పారు. చివరికి రాష్ట్ర కేబినెట్ సమావేశం వరకు వచ్చే సరికి 31 వేలకు దీన్ని కుదించారు. కనీసం అంతమేరకైనా చేశారా అంటే అదీ లేదు. రాష్ట్ర బడ్జెట్ లో మరింత కోత పెట్టి 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. తీరా మూడు విడతల రుణమాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో మమ అనిపించారు. 49,500 కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీ కాస్తా.. మూడు విడతల్లో దాదాపు మూడింతలు తగ్గి 17,933 చేరింది. 40 శాతం కూడా రుణమాఫీ చేయకుండా.. లక్షలాది మంది రైతులను నట్టేట ముంచి ప్రక్రియ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేయడంతో.. యావత్ తెలంగాణ ఇవాళ రైతుల ఆందోళనలతో అట్టుడుకుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ లో రుణమాఫీ కాని అన్నదాతలు రోడ్డెక్కారు. మంచిర్యాలలో రుణమాఫీ కాలేదని మనస్థాపం చెంది ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అటు కరీంనగర్ రాజీవ్ రహదారిపై అన్నదాతలు రాస్తారోకో నిర్వహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మొలంగూరులోని ఇండియన్ బ్యాంకు ఎదుట రైతులు బైఠాయించి నిరసన చేపట్టారు. వనపర్తిలో రైతువేదిక సాక్షిగా రుణమాఫీ కాని రైతులు అబద్ధాల ముఖ్యమంత్రికి పాలించే హక్కు లేదని నిలదీశారు. ఇటు జగిత్యాలలో రుణమాఫీ కాలేదని కెనెరా బ్యాంకు ముందు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. ఇలా ఒకటా రెండు… రుణమాఫీ కాని అన్నదాతల ఆందోళనలతో యావత్ తెలంగాణ అట్టుడుకుతోంది. దేవుడి మీద ఓట్ల పెట్టి మరీ మోసం చేసిన ముఖ్యమంత్రి తీరుపై రైతులోకం ఆగ్రహంతో ఊగిపోతోంది.
ఇప్పటికే అనేక జిల్లాల్లో అప్పుల భారం భరించలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అడ్డగోలు ఆంక్షలు..అర్థంలేని షరతులతో ఒక ప్రహసనంగా మార్చిన రుణమాఫీని రైతులందరికీ పూర్తిచేయాలి. రైతు రుణమాఫీకి సంబంధించి మా పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ కి కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1,20,000 కు పైగా ఫిర్యాదులు వచ్చాయి.
కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రైతులను నిలువునా మోసం మోసం చేసిన ఈ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తన వైఖరి మార్చుకొని రాష్ట్రంలోని అన్నదాతలందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రాష్ట్రంలోని అన్నదాతల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అప్పటివరకు తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను.
జై కిసాన్….. జై తెలంగాణ
ఇట్లు
కల్వకుంట్ల తారకరామారావు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్