KTR | హైదరాబాద్ : ఈ నెల 20న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుంది. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తుంది. గత పుష్కరకాలంగా లక్షల కోట్ల రూపాయలు పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పిజి రేట్ల రూపంలో ప్రజల నుంచి దోచుకుంది. ఒక వైపు ప్రతి నెల వేలాది రూపాయాలు పెట్రోల్, ఎల్పిజి, డీజిల్ రూపంలో భారం మోపుతూ.. జిఎస్టి స్లాబ్ మార్పు వలన కేవలం పదుల రూపాయల భారం తగ్గిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ధరల తగ్గింపుపైన చిత్తశుద్ధి ఉంటే.. దానికి ప్రాథమిక కారణమైన పెట్రో ధరలను తగ్గించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ తగ్గితే రవాణా భారం తగ్గి.. దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పిజిపైన పన్నులు తగ్గించి.. సెస్సులను పూర్తిగా ఎత్తివేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేకుంటే మీ మాటలు మరొక జుమ్లాలాగా మిగిలిపోతాయి. చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేపటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కొన్ని కీలకమైన ప్రజా సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. గతంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రజల పక్షాన మా వాదనను వినిపించడం మా కర్తవ్యంగా భావిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. చేనేత మిత్ర పథకంతో ముడి సరకును 50 శాతం సబ్సిడీకే ఇవ్వడంతో వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు బీమాతో ధీమా ఇచ్చింది. అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం అని నిరూపించాము. లోకం మానం కాపాడడానికి మగ్గం పట్టిన నేతన్న తయారుచేసిన వస్త్రాలపై ఎలాంటి పన్నులు ఉండొద్దన్న ఉదాత్తమైన ఆలోచన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారితో పాటు మా అందరికి ఉండేది. ఎన్నో వేదికలపై ఇదే విషయాన్ని మేం స్పష్టం చేశాము. కాని ప్రజాసమస్యలు, ప్రజల అభిప్రాయాలను ఏ కోశానా పట్టించుకోని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీ విధించింది. అంతటితో ఆగకుండా పన్నును 12 శాతం పెంచాలని ఆ తరువాత నిర్ణయించింది. ఆ సమయంలో దేశంలో అందరి కంటే ముందే నేను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధానమంత్రి మోడీ గారికి బహిరంగ లేఖ రాశాను. వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారంగా ఉన్న చేనేత రంగంపై పూర్తిగా పన్నును ఎత్తివేయాల్సింది పోయి పెంచుతారా అని ప్రశ్నించాను. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో 12 శాతం నిర్ణయం అమలును మీరు వాయిదా వేశారు. అయితే చేనేత వస్త్రాలపై ఇప్పుడున్న 5 శాతం జిఎస్టీని కూడా పూర్తిగా రద్దు చేయాలని మరోసారి నేను బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. చేనేత అనేది కేవలం వస్త్ర తయారీ రంగం మాత్రమే కాదు అది మన సాంస్కృతిక వారసత్వం. దానిపై పన్ను వేయడం అంటే మన సంస్కృతిని అవమానించడమే.
జీఎస్టీలోని 12 శాతం స్లాబ్‌ను రద్దు చేసి, పేద, మధ్యతరగతి ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ప్రజలను మభ్యపెట్టే మరో “జుమ్లా” తప్ప మరొకటి కాదు. మొత్తం జీఎస్టీ పరిధిలోని 22 లక్షలకోట్లకు పైగా వచ్చే ఆదాయంలో ఈ 12 శాతం స్లాబ్ వాటా కేవలం 5 శాతం మాత్రమే. ఇంత నామమాత్రపు వాటా ఉన్న స్లాబ్‌ను రద్దు చేసి,అందులోని వస్తువులను వేరే స్లాబుల్లోకి మార్చి దేశ ప్రజలందరినీ ఉద్ధరించినట్లు మోడీ ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. గత దశాబ్ద కాలంగా పాలు, పెరుగు, పప్పు, ఉప్పు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచింది మీ బీజేపీ ప్రభుత్వం. ఇంతేకాదు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపింది. ఈ పాపాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు స్లాబ్ రద్దు అంటూ లీకులు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.
గత పన్నెండేళ్లుగా బీజేపీ పాలనలో విపరీతంగా పెరిగిన ధరలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్‌పై మీరు విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ, సెస్సులు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2014 నాటి స్థాయికి పడిపోయినా, దేశంలో మాత్రం పెట్రో ధరలు మాత్రం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజల సంపదను లూఠీ చేస్తున్న ఈ భారాన్ని తగ్గించకుండా, జీఎస్టీలో నామమాత్రపు మార్పులు చేయడం తో ప్రజలకు ఒరిగే ప్రయోజనం శూన్యం. నిత్యావసర ధరల పెరుగుదలకు మీరు పెంచిన పెట్రో, ఎల్పీజీ రేట్లే అసలు కారణమన్న సంగతిని గ్రహించనంత వరకు దేశ ప్రజలకు ఎలాంటి ఉపశమనం లభించదు. మీరు ఇష్టారీతన పెంచిన పెట్రో, ఎల్పీజీ ధరలను తగ్గిస్తేనే రవాణా భారం తగ్గి ఆటోమెటిక్ గా ధరాభారం తగ్గుతుంది. ఇక పెట్రో ధరలను పన్ను రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెంచడం మీరు తీసుకున్న మరో అప్రజాస్వామిక నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పన్నుల రూపంలో పెంచితే వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందన్న అక్కసుతో పెట్రో రేట్లను సెస్సుల రూపంలో పెంచి మీరు రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూశారు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం ఉంటుందన్న సమాఖ్య స్పూర్తిని మరిచి మీరు వ్యవహరించారు. అందుకే పెట్రో, ఎల్పీజీ రేట్లను తక్షణమే తగ్గించడంతో పాటు సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాను.
రేపటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, దేశ ప్రజల తరఫున మేము ఈ క్రింది డిమాండ్లను మీ ముందు ఉంచుతున్నాము:
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని సంపూర్ణంగా రద్దు చేయాలి.
ప్రజలను దోచుకుంటున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై పన్నులను తక్షణమే తగ్గించి సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి.
12 శాతం స్లాబ్ రద్దు వంటి కంటితుడుపు చర్యలు ఆపి, నిత్యావసర వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తనకు అలవాటైన “జుమ్లాల”ను పక్కనపెట్టి, ధరలు తగ్గించే చిత్తశుద్ధిని ప్రదర్శించాలని, మా సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
తెలంగాణ ప్రభుత్వం కూడా రేపటి సమావేశంలో చేనేతపై జీఎస్టీ రద్దు కోసం గట్టిగా పట్టుబట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
పెట్రో, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జిఎస్టీ స్లాబ్ రద్దు అంటూ.. దాంతోనే ప్రజల జీవితాలు బాగుపడతాయని ప్రచారం చేసుకుంటుంది. ప్రతీ నెల పేద, మధ్యతరగతి ప్రజల నుంచి వేల రూపాయలను కొల్లగొట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జిఎస్టీ స్లాబ్ రద్దు తో వారికి కలిగే నామమాత్రపు ప్రయోజనాన్ని కూడా తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. నిజంగా ప్రజలకు గరిష్ట ప్రయోజనం కలిగించాలని కేంద్రం భావిస్తే తక్షణమే పెట్రో, ఎల్పీజీ రేట్లను తగ్గించి, సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. అలా చేయకపోతే ఈ ప్రచారం కూడా మరో జుమ్లా లాగానే మిగిలిపోతుంది.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ధరలు తగ్గించి, దేశ ప్రజలకు “అసలైన దీపావళి”ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ధరల మంటకు ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. అప్పుడే మీరు పెంచిన ధరలు తగ్గి ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
కల్వకుంట్ల తారక రామారావు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్