హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలి అటవీ భూముల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు పాటు పడే ప్రతి ఒకరికీ దకిన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను ప్రభుత్వం పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన ఎక్స్ వేదికగా బుధవారం సంతోషం వ్యక్తంచేశారు. వన్యప్రాణులను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్‌కు ఆదేశాలివ్వడం గొప్ప విజయమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతమిచ్చినట్టయిందని అభిప్రాయపడ్డారు.
మూగజీవాలు, వృక్షాలు, పర్యావరణానికి అండగా నిలిచిన హెచ్‌సీయూ విద్యార్థులకు, ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడి, హైదరాబాద్ భవిష్యత్తు కోసం నిలబడిన ప్రతీ ఒకరికి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా బీఆర్ఎస్ స్వాగతిస్తున్నదని వెల్లడించారు. గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో రేవంత్‌రెడ్డి రూ.10 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అడవులు, వన్యప్రాణుల పట్ల రేవంత్ నంబర్ వన్ విలన్‌గా మారాడని విమర్శించారు. పర్యావరణ విధ్వంసానికి పాల్పడి తప్పించుకోలేరనే కనీస సోయి ఈ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా వస్తుందేమోనని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలని హితవు పలికారు.