KTR | హైదరాబాద్ : అటవీ భూమిని అమ్మడమే తప్పు.. నీది కాని భూమిని అమ్మడం ఇంకా పెద్ద తప్పు అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
పారదర్శకత లేకుండా మొదట రూ. 30 వేల కోట్లని ఆ తర్వాత రూ. 20 వేల కోట్లని చివరికి రూ. 16 వేల కోట్లకు ఆ భూమి విలువను కుదించి తన వాళ్లకు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ఆర్థిక మోసానికి పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. ఆర్బీఐ గవర్నర్కు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సెబి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలకు మా పార్టీ తరపున ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నాం. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డ బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఆయాచిత లబ్ధి జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో ఐసిఐసిఐ బ్యాంకు లోన్ మంజూరు చేసింది. ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలిసి కూడా.. ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇచ్చింది. కనీసం ఆ భూమిని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధులు ఎవరు ఇన్స్పెక్ట్ కూడా చేయలేదు. కేవలం బ్రోకర్ చెప్పాడని పదివేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి ఐసిఐసిఐ బ్యాంకు చెల్లించింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని విచారిస్తాం. ఈ డబ్బులతో రైతు బంధు వేస్తామని తమ అనుకూల మీడియాలో ప్రచారం చేశారు కానీ రూ. 5000 కోట్లు కూడా అన్నదాతల ఖాతాలో వేయలేదు మిగతా రూ. 5000 కోట్లు ఏమయ్యాయి? మంత్రివర్గంలో ఉన్న కాంట్రాక్టర్లు, వాళ్ల మనుషులకు కమిషన్లు, బిల్లులు చెల్లించడానికి ఉపయోగించారు. ఈ ఆర్థిక మోసంతో ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఆ బ్యాంకు కుప్పకూలే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండానే జరిగిందని భావిస్తున్నాను. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ది నిరూపించుకోవాలి. రేవంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంకు, బ్రోకర్ సంస్థ పాత్రపై విచారణ జరగాల్సిందే. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు అడ్డుకోకపోతే మరో అరవై వేల కోట్ల రూపాయల భూ దోపిడీకి రేవంత్ ప్రభుత్వం స్కెచ్ చేసింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీకన్ ట్రస్టీ షిప్ అనే కంపెనీ, ట్రస్ట్ అడ్వైజర్స్ సంస్థలకు హెచ్ఎండిఏ భూములను ప్రభుత్వం అప్పజెప్పింది. ఈ రెండు సంస్థలపై వెంటనే నిషేధం విధించాలి. అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వం తీసుకున్న పదివేల కోట్ల రూపాయల బాండ్లను ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ కుమ్మక్కయ్యిందని భావించాల్సి వస్తుంది. త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ పేరును బయట పెడతాను. కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోతే కోర్టుకు పోతాం. మా పార్టీ తరఫున ప్రధానమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. మిత్రపక్షాల ద్వారా లోక్ సభ, రాజ్యసభల్లోను ఈ అంశాన్ని లేవనెత్తుతాం. నిన్న వచ్చిన అపెక్స్ కమిటీ పర్యావరణ విధ్వంసంపై విచారణ జరిపింది. అందుకే ఈ ఆర్థిక మోసంపై ఫిర్యాదు చేయలేదు అని కేటీఆర్ తెలిపారు.