KTR | హైదరాబాద్ : తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా బరాబర్ ఉంటది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీకు మూడు చెరువుల నీళ్లు తాగించి మళ్లొక్కసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో పరిగి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనవసరంగా గెలిపించామని రైతులు, మహిళలు, నిరుద్యోగులు బాధపడుతున్నారు. మొన్ననే నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్‌కు సంవత్సరికం చేశారు. కొడంగల్‌లో విషయం అర్థమైంది కాబట్టే కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీలో ఉండే ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి. నేల విడిచి సాము చేయొద్దు. గట్టిగా పని చేస్తే మనమే గెలవబోతున్నాం. అప్పుడు అధికారులందరూ మన చుట్టే తిరుగుతారు. పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విపరీతమైన కోపం ఉంది. మనకు ఓటేయడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారు. అవసరమైతే మనం చేసిన తప్పులను క్షమించండి అని అడగాలి. పద్ధతిగా పని చేయాలి. పోయినా పదేండ్లలో పార్టీని పెద్దగా చూడలేదు. వచ్చేసారి కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఆర్థికంగా బలోపేతం చేస్తాం. పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి పెడుతాం. బీఆర్ఎస్ ఉండనే ఉండదు బీజేపీలో పోతదని తలకు మాసినోళ్లు అంటున్నరు మనకేం కర్మ పట్టింది. తెలంగాణ ఉన్నంతకాలం ఈ గులాబీ కండువా బరాబర్ ఉంటది. రెండు పార్టీలకు మూడు చెరువుల నీళ్లు తాగించి మళ్లొక్కసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని గులాబీ సైనికులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉన్నంత కాలం
బరాబర్ గులాబీ జెండా ఉంటది.కాంగ్రెస్ – బీజేపీ లకు మూడు చెర్ల నీళ్లు తాగించి..
మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం.
మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం.జై తెలంగాణ ✊
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/G7cUpL5zBw
— BRS Party (@BRSparty) August 7, 2025