హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ‘పదేండ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకొని ఎవరెస్ట్‌ను అధిరోహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు, నేడు బుక్కెడు బువ్వకోసం గుండెలవిసేలా రోదించటమా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలకుల పాపం, విద్యార్థులకు శాపంగా మారిందని మంగళవారం ఎక్స్‌వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. ‘అన్నపూర్ణగా ఎదిగిన నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా?’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా?’ అని ఆక్షేపించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు, అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేండ్ల కేసీఆర్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో మిగిలింది ‘అన్నమో రామచంద్రా! అని ఆకలికేకలా?’ అని ప్రశ్నించారు.
విషాదంలో దేశముంటే వియత్నాంకు రాహుల్
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణం పట్ల దేశం మొత్తం విషాదంలో ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వియత్నాం పర్యటన చేయడంలో ఆశ్చర్యమేమీ లేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. పార్టీ కోసం, దేశం కోసం జీవితాంతం సర్వస్వం ధారపోసిన నాయకులను అవమానించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహనీయులను అవమానపరచడమని ఎక్స్‌వేదికగా విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు.
3డీ కాంగ్రెస్ ప్రజల నుంచి తప్పించుకోలేదు
కాంగ్రెస్ పార్టీ అంటేనే 3డీ (మోసం, విధ్వంసం, విస్మరణ) అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయలేదని ఎక్స్‌వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. 2024లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు 2025లో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.