KTR | హైదరాబాద్ : కేవలం 20 నెలల్లోనే అన్ని వర్గాలను వంచించిన దగాకోరు రేవంత్ సర్కార్.. ప్రైవేట్ రంగంలోని డ్రైవర్లను సైతం నట్టేట ముంచింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు అసంఘటితరంగ కార్మికులకు, గిగ్ వర్కర్లకు అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్.. గద్దెనెక్కాక ఉన్న పథకాన్ని కూడా ఊడగొట్టాడు! అని ధ్వజమెత్తారు.
మహోదాత్త హృదయంతో, మానవీయ కోణంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకానికి ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఎగ్గొట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ పెట్టింది.. నిరుపేద డ్రైవర్ల కుటుంబాలకు క్షోభను మిగిల్చింది అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అక్టోబర్ నుండి పథకాన్ని ఆపేసి.. ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్ల కుటుంబాలను రేవంత్ రోడ్డున పడేశాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతు బీమా, నేతన్నకు బీమా, డ్రైవర్లకు బీమా వంటి ఎన్నో పథకాలతో సబ్బండ వర్ణాల ప్రజల భవిష్యత్తుకు కేసీఆర్ ధీమా అందిస్తే.. ఒక్కో పథకానికి మంగళం పాడి పేద కుటుంబాల భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తోంది ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం. రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే సెటిల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. లేకుంటే డ్రైవర్ల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి, ఈ అమానవీయ సర్కార్ మెడలు వంచుతామని కేటీఆర్ హెచ్చరించారు.