KTR | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఓయూలో కనిపించిన విద్యార్థిని కనిపించినట్లే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్థుల నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
25 వేల పోస్టులతో డీఎస్సీ వేస్తామని మీరిచ్చిన హామీ ఏమైందంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు కేటీఆర్. మీరు కొలువుదీరితే సరిపోతుందా..? యువతకు కొలువులు అక్కర్లేదా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందన మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వినపడటం లేదా..? అని ప్రశ్నించారు.
ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు. డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి వారిని ఆందోళనలను అణచివేస్తున్నారు. వందల మందిని అన్యాయంగా అరెస్టుచేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు. మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం. మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు. నిత్యం పోలీసుల బూట్లచప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నరు. ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే.. డీఎస్సీ అభ్యర్ధులకు ఇంత ధోకా చేస్తారా..?? అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. లేకపోతే ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు.. నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రి గారు…
తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో
మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ?తొమ్మిది నెలలు కావస్తున్నా..
లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన
మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?మీరు కొలువుదీరితే సరిపోతుందా ?
యువతకు కొలువులు అక్కర్లేదా ??గతంలో… pic.twitter.com/lkaxRGIOtJ
— KTR (@KTRBRS) July 9, 2024