KTR : కాంగ్రెస్ పార్టీపైన, గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తెలంగాణ సమాజానికి జరిగిన ద్రోహాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన దారుణాలను ప్రశ్నించారు. తెలంగాణలో వేలమంది ఎవరివల్ల అమరులయ్యారు..? అమరువీరుల స్థూపం ఎవరివల్ల నిర్మించాల్సి వచ్చింది..? అంటూ ప్రశ్నల పరంపరను మొదలుపెట్టారు.
హైదరాబాద్ రాష్ట్రాన్ని వేరుగానే ఉంచాలని, ఆంధ్రాతో కలుపవద్దని పోరాడిన విద్యార్థులపై సిటీ కాలేజీ దగ్గర కాల్పులు జరిపింది ఎవరు..? 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు..? 1971 పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో తెలంగాణ ప్రజాసమితి (TPS) పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీని మాయం చేసింది ఎవరు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ విధంగా కాంగ్రెస్ ద్రోహాలను ఒక్కొక్కటిగా ప్రశ్నల రూపంలో ప్రస్తావిస్తూ.. ఆ ప్రశ్నలకు ‘కాంగ్రెస్ పార్టీ’ అనే సమాధానాలను ఇస్తూ పోయారు. చివరగా ‘రేవంత్రెడ్డి చెప్పినట్టుగా వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు..?’ అనే ప్రశ్నను సంధించారు. ఈ ప్రశ్నకు మాత్రం ‘కాంగ్రెస్ పార్టీ’ అనే సమాధానం ఇవ్వకుండా ఖాళీగా వదిలేశారు. ఎవరు అనేది నెటిజన్లే చెప్పాలి అన్నట్టుగా డ్యాష్ పెట్టి వదిలేశారు. ఆ పోస్టుకు అమరవీరుల స్థూపం ఫొటోను జతచేశారు.
తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల?
1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు?
— KTR (@KTRBRS) May 31, 2024