KTR | డిప్యూటీ సీఎం.. వ్యవసాయ శాఖ మంత్రుల ఇలాకాలోనూ రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం చెప్పులు క్యూలైన్లో పెట్టి మరీ పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోడౌన్ ఎదుట యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూసి, ఓపిక లేక క్యూ లైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాశారు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలో ఎంత అద్వానంగా ఉందో అంటూ రైతన్నలు విమర్శిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. క్యూలైన్లో ఉన్న ఈ చెప్పులే.. చెప్పుల దండలుగా మారే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఇవాళ క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే.. ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయమని.. పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యమని స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు డిపోల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యమైపోతున్నాయి. ముఖ్యంగా యూరియా కొరత సంక్షోభంగా పరిణమిస్తున్నది. ఎరువుల డిపోల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటంతో పోలీసు భద్రత ఏర్పాటుచేయాల్సి వస్తుండటం గమనార్హం. అర్ధరాత్రి నుంచే రైతులు బారులు తీరడం, కొన్నిచోట్ల చెప్పులు, సంచులు క్యూలైన్లలో ఉంచడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పలుచోట్ల ఓపిక నశించిన రైతులు నిరసనలకూ దిగుతున్నారు. తగినంత ఎరువు సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, పంపిణీ వ్యవస్థ సవ్యంగా పనిచేయడం లేదని, మరోవైపు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని కేంద్రం ఆరోపిస్తున్నది. ఇస్తినమ్మ వాయినం తరహాలో ఇరుపక్షాలూ ఒకరి మీద మరొకరు నెపం మోపాలని చూస్తున్నాయి. మధ్యలో రైతాంగం నలిగిపోతున్నది.