KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తే కొడతారని అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం జరిగిన సిర్పూర్ కాగజ్‌నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదని పేర్కొన్నారు.
ప్రజలు తిడుతున్న తిట్లకి రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ల ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని కేటీఆర్ విమర్శించారు. తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని తెలిపారు. ఇంత దుర్మార్గమైన పాలన చేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఏమున్నదో ఆలోచించుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల మనుషులే కానీ చేతల ప్రభుత్వం కాదు అని అర్థమైందని అన్నారు. .
తెలంగాణ నలుమూలలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా వ్యతిరేకత నెలకొని ఉందని కేటీఆర్ తెలిపారు. 140 ఎకరాల భూముల కోసం కొడంగల్‌లోని ఒక ఊరికి 450 మంది పోలీసులను సీఎం పంపించారని పేర్కొన్నారు. తెలంగాణలో పేదవాళ్లు బతకవద్దా అని ప్రశ్నించారు. తెలంగాణలోని పేదోళ్ల గురించి ఆలోచించి గత పదేళ్లు కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు.
అధికారం కోసం పార్టీలు మారే అవకాశవాదుల గురించి మాట్లాడాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం మనకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8 మంది చొప్పున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచినా తెలంగాణకు తెచ్చింది.. దక్కింది శూన్యమని కేటీఆర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక్క కాంగ్రెస్, బీజేపీ ఎంపీ నోరు మెదపలేదని విమర్శించారు. అదే లోక్ సభలో గులాబీ దండు ఉండుంటే కేంద్రంపై కొట్లాడుతుండే అని అన్నారు.