KTR | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన దగ్గర రేవంత్ రెడ్డి హైస్కూల్ చదుకున్నాడు. పిల్లగాడు బాగా చదవడం లేదని, ఫెయిల్ అయ్యిండని కేసీఆర్ పంపించేశాడు అని కేటీఆర్ చురుకలంటించారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రమంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హైదరాబాదులో మాత్రం బీఆర్ఎస్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్ను అన్ని స్థానాల్లో గెలిపించారు. ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీతమ్మ మీ ముందుకు వచ్చింది. అందరూ ఆమెను ఆశీర్వదించండి అని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ కేవలం లక్ష రూపాయలు ఇస్తున్నాడు. మేం అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ నేతలు అబద్ధపు మాటలు చెప్పారు. చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ నేతల లూటీ మాత్రం ఆగడం లేదని కేటీఆర్ విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమే. హైదరాబాదులోని బస్తీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తమ ఇంటిని కూలగొడుతుందో అని భయంతో బతుకుతున్నారు. తన ఇల్లు కూలగొడతారన్న భయంతో కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు ఏ రోజూ పేదోడి ఇంటిని కూలగొట్టలేదు. హైదరాబాదులో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు. హైదరాబాద్ లోని ఒక్కో నియోజకవర్గానికిి మూడు వేల ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. పక్క బస్తీలోకి వచ్చిన బుల్డోజర్ కచ్చితంగా రేపు మీ ఇంటి ముందు కూడా వస్తుంది. పేదవాడి కడుపు కొడుతున్న ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెప్పాలి అని కేటీఆర్ సూచించారు.
ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువుల ఇల్లు కడితే హైడ్రా బుల్డోజర్ పోదు. చెరువుల్లో ఇండ్లు కట్టుకున్న మంత్రుల జోలికి హైడ్రా పోదు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డి కుంటలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటేస్తే మీ వేలుతో మీ కంటినే పోడుచుకున్నట్టు అవుతుంది. వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ దారుణంగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు పెన్షన్, ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కేసులకు భయపడితే లీడర్లు కాలేరు. న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడాలి. 420 హామీల అమలు ఎప్పుడు అని కాంగ్రెస్ నేతలను ఎక్కడికిక్కడ నిలదీయండి. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మను గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు అందరి మీద ఉంది. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గాని, ముస్లిం ఎమ్మెల్సీ గాని లేరు. అమీర్ అలీ, అజారుద్దీన్‌లకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. తాను మోడీ దగ్గర స్కూల్‌కు, చంద్రబాబు దగ్గర కాలేజీకి వెళ్లి, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని రేవంత్ చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ దగ్గర హైస్కూల్ చదువుతుంటే ఫేయిల్ అయిండని పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ఆ విషయాన్ని రేవంత్ గమనించాలని కేటీఆర్ సూచించారు.
రేవంత్ రెడ్డి స్కూల్ మోడీ దగ్గర,
కాలేజ్ చంద్రబాబు దగ్గర,
ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాను అంటున్నాడుకానీ హైస్కూల్ మన దగ్గర చదివిన సంగతి చెప్పడం లేదు
మన స్కూల్లో ఫెయిల్ అయ్యాడని రేవంత్ రెడ్డిని కేసీఆర్ పంపించేసాడు – కేటీఆర్ pic.twitter.com/SEm8jJxMgK
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2025