KTR | హైదరాబాద్ : ఈ నెల 14న జూబ్లీహిల్స్లో ఎగిరేది గులాబీ జెండానే అని సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వెంగళ్రావ్ నగర్ డివిజన్లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టిన సందర్భంగా ఓ జర్నలిస్టు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీకు రెఫరెండంగా ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించగా.. ఏం కాదు.. నేను ఒప్పుకోను అని రేవంత్ రెడ్డి బదులిచ్చాడు. చిన్న, చిన్న మార్పులు చేసుకుంటా అని తెలిపారు. అంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసింది.. 14న ఎగిరేది గులాబీ జెండా అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం 14 ఏండ్ల పాటు కొట్లాడినం. 10 ఏండ్లు అధికార పార్టీగా సేవలందించాం. హైదరాబాద్ మహా నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయకుండా మొత్తం బీఆర్ఎస్ను గెలిపించారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ని గెలిపించారు. ఒక్క సీటును కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఈ 25 ఏండ్ల కాలంలో ఎంతో మంది సీఎంలను చూశాం. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్, రేవంత్ రెడ్డి ఆరుగురు సీఎంలను 25 ఏండ్లలో చూశాం. ప్రజల ఇష్టం బట్టి అధికార మార్పిడి జరుగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం చంద్రబాబు, వైఎస్సార్ ప్రయత్నించారు. తర్వాత రోశయ్య కిరణ్ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఎందుకంటే వారికి విజ్ఞత ఉండే.. అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయాలని అని కేటీఆర్ పేర్కొన్నారు.
2014లో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. పదేండ్లలో పేదలను ఆదుకున్నారు. పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేశారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి నేను సర్కార్ దవఖానాకు పోతా అనే రోజులు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయి మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేలు ఇచ్చారు. ఇలా 15 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు అయ్యారు అని కేటీఆర్ తెలిపారు.
భావితరాల కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. 42 ఫ్లై ఓవర్లు కట్టుకున్నాం. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎనిమిదిన్నర కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసుకున్నాం. వెంగళ్రావు నగర్ డివిజన్లో 1000 పడకల ఆస్పత్రి 900 కోట్లతో కట్టించారు. హైదరాబాద్ నగరంలో పరిశ్రమలను, ఐటీని పెంచుకున్నాం. 2014లో 3 లక్షల 20 వేల మంది ఐటీ ఉద్యోగుల ఉంటే.. 2023 నాటికి 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులను సృష్టించాం. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు నగరాన్ని దాటం. 2014లో ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లు.. 2023 నాటికి 2 క్షల 40 వేల కోట్లకు తీసుకెళ్లాం. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పెరిగింది. అభివృద్ధిలో దూసుకుపోయింది. దేశానికి ఆదర్శంగా నిలబడింది హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పల్లెలను, పట్టణాలను బాగు చేసుకున్నాం. 350 బస్తీ దవఖానాలు కట్టుకున్నామని కేటీఆర్ తెలిపారు.