KTR | అచ్చంపేట : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెలరేగిపోయారు. ఆయన నల్లమల పులి కాదు.. నల్లమల గుంట నక్క అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన జన గర్జన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నల్లమల పులి కాదు నల్లమల గుంట నక్క, అచ్చంపేట నుండి పారిపోయి కొడంగల్ వచ్చిందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఈసారి మేము కొడంగల్లో తరిమిస్తే ఆ గుంట నక్క ఎటు పోతుందో అని కొడంగల్ ప్రజలు అంటున్నారు. నల్లమల గుంట నక్క అని ఆయనను ఉట్టిగనే అనట్లేదు.. ఎందుకంటే ఓటేస్తే రుణమాఫీ చేస్తా.. ఉరికి ఉరికి తెచ్చుకోండి అన్నాడు. కానీ ఇంత వరకు పూర్తిస్థాయిలో కాలేదు రుణమాఫీ. ఆరు గ్యారెంటీలు అన్నాడు.. ఎన్నో కథలు చెప్పిండు.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పొంకనాలు కొట్టిండు.. అఖరికి కొండారెడ్డి పల్లెలో కూడా పెన్షన్లు రాలేదు. అత్తకు 4 వేలు, కోడలికి 2,300 ఇవ్వలేదు. 2 వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు. 18 ఏండ్లు నిండిన వారికి నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. అందుకే ఆయనను గుంట నక్క అనాల్సి వచ్చిందని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారెంటీ కార్డులు పంచారు.. అందుకే అచ్చంపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు పంచబోతున్నాం. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి 55 వేలు బాకీ, కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్ష రూపాయాలు ఇస్తున్నడు.. నేను దాని మీదకెళ్లి తులం బంగారం ఇస్తా అన్నాడు.. ఇప్పటి వరకు 8 లక్షల పెళ్లిల్లు అయ్యాయి. మరి 8 లక్షల తులాల బంగారం అడుగుదాం. వికలాంగుల పెన్షన్ల కింద ఒక్కొక్కరికి 44 వేలు బాకీ ఉన్నాడు. ఈ బాకీ కార్డు గ్రామగ్రామానికి గడప గడపకు పోవాలి.. ఈ బాకీ కార్డే బ్రహ్మస్త్రం కావాలి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నిలదీయాలి కాంగ్రెసోళ్లను. ఓటుకు ఎంతిస్తే అంత తీసుకోండి.. బాకీ కార్డు ముందర పెట్టి నిలదీయండి అని కేటీఆర్ సూచించారు.