KTR | ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపనున్నట్లు తమకు సమాచారం అందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ 9 ప్రతిపాదనలు ఏవైతే డిస్కంలు చేశాయో వాటిని విరమించుకోవాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ ఛైర్మన్ గారిని కలిసి కోరామని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇళ్లలో వాడుకునే కరెంట్‌కు సంబంధించి నెలకు రూ. 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలను10 రూపాయల నుంచి ఏకంగా రూ. 50 పెంచాలని ప్రతిపాదన చేశారని అన్నారు. ఇది అతి ప్రమాదకరమైన ప్రతిపాదన అని.. ఈ ఒక్క నిర్ణయం మొత్తం ప్రజల ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెడుతుందని వ్యాఖ్యానించారు. సామాన్యుల గృహాలకు సంబంధించి బలంగా, భారీగా విద్యుత్ బిల్లుల భారం పడుతుందని అన్నారు.
పరిశ్రమలన్నింటినీ ఒకే కేటగిరీ అనే ప్రతిపాదన చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇది చాలా అసంబద్ధమైన, సిల్లీ ఆలోచన. పరిశ్రమలకు తీవ్ర అన్యాయం చేసే నిర్ణయమని పేర్కొన్నారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పిచ్చి ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలన్నింటికీ ఒకే టారిఫ్ చేసే విధంగా చేయడమంటే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మందగమనంలో ఉందని తెలిపారు. ఫాక్స్ కాన్ సంస్థ కూడా తమ విస్తరణకు సంబంధించి ఏమీ చెప్పటం లేదన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రా అంటున్నారు.. కానీ మన తెలంగాణ పేరు చెప్పటం లేదని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేన్స్ సహా కొన్ని పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని తెలిపారు. ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కూడా ఈ ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదని కేటీఆర్ అన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా డిస్కమ్‌లు చార్జీలు ప్రతిపాదించాయని తెలిపారు. ట్రూ అప్ ఛార్జీలు 12 వందల కోట్లు కావాలంటే అప్పుడు కేసీఆర్.. తామే భరిస్తామని చెప్పి ప్రజల మీద ఆ భారం పడనీయలేదని అన్నారు. విద్యుత్‌ను తాము కేవలం వ్యాపార వస్తువుగా చూడలేదని.. అది సామాన్యుడి జీవితంలో దైనందిక అవసరమని భావించామని తెలిపారు. అందుకే రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించామని.. 24 గంటల కరెంటు ఇచ్చామని పేర్కొన్నారు. నాయి బ్రహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంట్, దళితులకు ఉచిత కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేశామన్నారు.
రాష్ట్రం ఏర్పడిన నాడు 7 వేల మెగావాట్ల సామర్థ్యం ఉంటే దాన్ని 24 వేల మెగావాట్లకు తీసుకెళ్లామని తెలిపారు. విద్యుత్ ఛార్జీలను పెంచితే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుందని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు అనేది రాష్ట్ర అభివృద్ధి అంశంతో ముడిపడి ఉన్నదని అన్నారు. సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ, కాటేదాన్‌లో పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చామని.. ఈ ప్రతిపాదనలతో వారికి సబ్సిడీ లేకుండా పోతుందని తెలిపారు. అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతామంటే అంగీకరించవద్దని ఈఆర్సీ ఛైర్మన్ ను కోరామని పేర్కొన్నారు. ఈ నెల 23న పబ్లిక్ హియరింగ్ లో పాల్గొనాలని ఈఆర్సీ ఛైర్మన్ కోరారని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ముందే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ 23న హియరింగ్స్ లో మా వాదనలు వినిపిస్తామని చెప్పారు.