KTR | రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన నడుస్తోందని మాటల దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనిపిస్తుందని ప్రశ్నించారు. ఎటు చూసినా రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో అంటే మేం గెలిచి వచ్చామని తెలిపారు. తాను ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా అని చెప్పారు. హరీశ్‌రావు ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యారని.. కవిత గెలిచిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సోదరులను ఏ ప్రజలు గెలిపించారని ప్రశ్నించారు.
తిరుపతి రెడ్డి ఫ్లెక్సీలు ఊరంతా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఫస్ట్ తిరుపతిరెడ్డి ఫ్లెక్సీ పెడితే అందులో రేవంత్ రెడ్డి ఫొటో పెట్టలేదని.. ఆ తర్వాత మళ్లీ అతికించారని ఎద్దేవా చేశారు. కొండల్ రెడ్డి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు ఒక బృందాన్ని తీసుకెళ్లాడని ప్రశ్నించారు. ఇంకో తమ్ముడితో అమెరికాలో వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఇది కుటుంబ పాలన కాదా? ప్రజలు చూస్తలేరా అని ప్రశ్నించారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రజలకు అర్థమవుతున్నాయని తెలిపారు.
మనం కూడా తొందరపడద్దని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. ప్రజలు వాళ్లకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. వాళ్లు ఇచ్చిన 420 హామీలు కచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నెరవేర్చకపోతే వాళ్లందర్నీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందామని సూచించారు. రాష్ట్రంలో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. వీళ్ల దొంగతనాలు ఒక్కొక్కటిగా దొరుకుతాయని అన్నారు. వీళ్ల కుటుంబ పాలన వ్యవహారాలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి కంపెనీకి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల టెండర్ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి బామ్మర్ది కంపెనీకే వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తాయని అన్నారు. ఆరు నెలలు తొందరపడొద్దని సార్ చెప్పారని తెలిపారు. సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, ఆలోచనలు చెప్పండని సూచించారని అన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు మనల్ని తట్టుకునే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. ఎందుకంటే వాళ్లకు సబ్జెక్టు లేదు.. సరుకు లేదని తెలిపారు. ఇష్టమొచ్చినట్టు ఒర్రుడు తప్ప.. సబ్జెక్ట్ అడిగితే ఆన్సర్ చెప్పే సమాధానం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అప్పుల పాలైందని, దివాళా తీసిందని చిల్లర మాటలు మాట్లాడారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించిందని, రాష్ట్రం ఎయిడ్స్ , క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయిందని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనేటోడు ఎంత లేకిగా మాట్లాడొచ్చా? అని ధ్వజమెత్తారు. నువ్వు రాష్ట్రాన్ని తిడితే.. పెట్టుబడులు ఎట్ల వస్తాయని నిలదీశారు. పెట్టుబడులు వస్తలేవు కాబట్టే వాళ్ల తమ్ముడితో సంతకం పెట్టించి, బామ్మర్దికి కాంట్రాక్ట్ ఇచ్చి.. ఏదో తెచ్చినమని పోజులు కొడుతున్నారని విమర్శించారు.
పాత గోడకు కొత్త సున్నం వేసినట్టుగా రేవంత్ రెడ్డి తీరు ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లోనే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకుందని తెలిపారు. 15, 16వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయిందని.. కోకాపేటలో బిల్డింగ్ తీసుకున్నారని పేర్కొన్నారు. అమెరికా వెళ్లి ఊరేగిన తర్వాత ఉత్త చేతులతో వస్తే బాగుండదని 16వేల ఉద్యోగాలు తెచ్చానని రేవంత్ రెడ్డి ఊదరగొట్టారని అన్నారు. మొన్న ఒప్పందమైతది.. ఈలోపు వాడు బిల్డింగ్ కట్టిండు.. 16వేల మందిని పెట్టుకున్నడు.. నువ్వు అమెరికా నుంచి దిగంగానే రిబ్బన్ కట్ చేసినవా.. ఇది నమ్మడానికి చెవుల పూలు పెట్టుకున్నమా? అని ప్రశ్నించారు. ఇట్ల చెప్పుకుంటూ పోతే వంద కథలు ఉన్నాయని అన్నారు. ఇట్ల పీఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని విమర్శించారు. అర్థమైన తర్వాత ప్రజలు నిలదీస్తారని స్పష్టం చేశారు.