KTR | బడ్జెట్ చూసుకుని గ్యారంటీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు
బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా అని ఖర్గేను ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా అని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో.. తెలంగాణ రాష్ట్రం.. ఏడాదిలోనే ఆగమైందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను నమ్మించి.. నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలన్నారు. అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషమని అన్నారు. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి.. ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిదని వ్యాఖ్యానించారు. గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిదని స్పష్టం చేశారు.