KTR | హైదరాబాద్ : ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హైడ్రా రాక్షసిని తరిమికొట్టాలని ఈ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం.. వేల మంది ఇండ్లను కూలగొట్టి.. గూడు లేకుండా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎర్రగడ్డ డివిజన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా మన నేతల మీద కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇండ్లను కూలగొడుతున్నారు. ఏదో సాధించామని సంకలు గుద్దుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. దిమ్మతిరిగే తీర్పు మీరు ఇవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి.. పదేండ్ల పాటు సంతోషంగా బతికాం. గరీబోళ్లను బ్రహ్మాండంగా చూసుకున్నారు కేసీఆర్. ఆసరా పెన్షన్లు ఇచ్చారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కింద లక్షా నూట పదహారు రూపాయాల చొప్పున 15 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చి వారి పెళ్లిళ్లు చేశారు. కేసీఆర్ కిట్ ఇచ్చాం. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళకు రూ. 2 వేలు, వికలాంగులకు రూ. 4 వేల పెన్షన్ ఇచ్చారు కేసీఆర్. హైదరాబాద్లోని పేదలకు 58, 59 జీవో కింద లక్షా 50 వేల పట్టాలు ఇచ్చారు. లక్ష డబుల్ బెడ్రూంలు కట్టించి ఇచ్చారు. 20 వేల లీటర్ల వరకు ఉచిత నీరు అందించారు. పుట్టిన పిల్లాడి నుంచి వృద్ధుల వరకు అందర్నీ ఆదుకున్నారు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు పెరిగాయి. లక్షల ఉద్యోగాలు వచ్చాయి. పదేండ్లు రియల్ ఎస్టేట్ బాగుండే. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేండ్లలో సర్వం నాశనమైంది. 4 వేల పెన్షన్ వచ్చిందా..? రెండున్నర వేలు వచ్చాయా..? తులం బంగారం వచ్చిందా..? కేసీఆర్ ముందే చెప్పిడు.. తులం బంగారం ఇచ్చేటోళ్లు కాదు మెడలో ఉన్న పుస్తెల తాడు గుంజుకుపోయేటోళ్లు. ఒక్క కొత్త ఇల్లు కట్టలేదు.. ఇటుక పెట్టలేదు.. కాంగ్రెస్కు అవకాశం ఇస్తే సర్వనాశనం అవుతది తెలంగాణ. రేవంత్ రెడ్డి పుట్టిన పిల్లాడి నుంచి చనిపోయే ముసలోడి దాకా మోసం అందర్నీ మోసం చేసిండు.. 420 హామీలు ఇచ్చారు. డిక్లరేషన్లు పెట్టారు.. ఒక్కటి కూడా అమలు కాలేదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో వేల ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. ఈ ఎన్నిక కారుకు, కాంగ్రెసోళ్ల బుల్డోజర్కు మధ్య.
కారు గెలిస్తే బుల్డోజర్ రాదు.. కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ ఎప్పుడు వస్తదో తెలియదు. కత్తి కాంగ్రెసోడికి ఇచ్చి యుద్ధం చేయమంటే సాధ్యం కాదు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ హైడ్రా పేరు మీద వేల ఇండ్లు కూలగొట్టిండు. ఎవడైతే కూలగొడుతుండో మళ్లా వానికి ఓటేసి.. కేసీఆర్ కొట్లాడాలంటే ఎట్లా..? హైడ్రా భూతం, హైడ్రా రాక్షసిని ఉట్టిగనే వ్యతిరేకిస్తలేం. హైడ్రా ప్రతాపమంతా గరీబోళ్ల మీదనే ఉంటది. తిరుపతి రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వివేక్, అరికెపూడి గాంధీ వద్దకు వెళ్లదు హైడ్రా. కానీ ఎర్రగడడ్డలో మీ ఇంటి మీదికి హైడ్రా వస్తది.. దయచేసి ఆలోచించండి.. ఈ ఎన్నిక ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టి పేద వారి గూడు కొలగొట్టిన కాంగ్రెస్ పార్టీకి, పేదవాడి కోసం గల్లాపట్టి కొట్లాడి నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.