KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ పాలన ఉందని కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి ప్రభాకర్ రావుతో పాటు 300 మంది కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు కేసీఆర్ చేసిన మేలు ప్రభాకర్ రావు వివరంగా చెప్పారు. కానీ ఆశ్చర్యం ఏందంటే సింగరేణి బెల్ట్‌లో ఉన్న 13 నియోజకవర్గాల్లో ఓడిపోయాం. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు మంచిర్యాల, గోదావరి పరివాహక ప్రాంతంలోని రామగుండం, మంథని, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగూడెంలో ఒక్క సీట్లో కూడా గెలవలేదు. దాని గురించి ఆలోచించాం. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చిన 10 హామీల్లో 8 హామీలు పూర్తి చేశాం. రెండు పాక్షింగా మిగిలాయాని చర్చించాం. 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. తర్వాత వచ్చిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం జరిగింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతుంది. ఈ కాలంలో ఒక్కటి మాత్రం జరిగింది.. ఏ ఒక్కరిని అడిగినా అప్పుడే బాగుండేది అని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరు అగమ్య గోచరంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. యూరియా సంక్షోభం తీవ్రంగా ఉంది. రాత్రి పూటనే లైన్లు కడుతున్నారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఇప్పుడేమో చెప్పుల జాతర అన్నట్టుగా పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులు చెప్పులు పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. భయంకరంగా చెప్పులు కనబడుతున్నాయి. ఆనాటి రోజులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు అని రైతులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి నిజాయితీగల్ల మోసగాడు.. ప్రజలు మా చేతుల్లో మోసపోవాలని కోరుకుంటారు అని రేవంత్ రెడ్డి అన్నాడు.. అదే చేశాడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు.