KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట.. నల్లగొండ, ఖమ్మం లీడర్లు కలిసి ఆయన కుర్చీని లాగేందుకు యత్నిస్తున్నారట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో యూసుఫ్‌గూడలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇందిరమ్మ రాజ్యం అని ఇండ్లు కూలగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. శని, ఆదివారం వచ్చిందంటే హైడ్రా పేరిట బస్తీలను కూలగొడుతున్నాడు. అందుకే ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టే వారికి ఓట్లు వేద్దామా..? హైడ్రా ద్వారా ఈ రెండేండ్లలో వేల ఇండ్లు కూలగొట్టారు. బుల్డోజర్ వచ్చి ఇల్లు కూలగొడుంతే కేసీఆర్ అన్నా ఎక్కడున్నవ్ రావాలని అంటున్నడు ఓ తమ్ముడు. కత్తి వాడికిచ్చి యుద్ధం చేయమంటే ఎట్ల..? కత్తి మాకు ఇవ్వండి బుల్డోజర్కు అడ్డం పోయి ఆపే బాధ్యత మాది. ఆపాలంటే కారుకు ఓటేయండి అని కేటీఆర్ కోరారు.
ఇవాళ రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ.. ఇంకా మాకు మూడేండ్లు ఉందని అంటున్నడు.. మైండ్ బ్లాంక్ అయ్యేలా ఓటుతో బుద్ది చెపితే మూడేండ్లు ఉంటడో.. మూడు నెలలు ఉంటడో ఎవరికి ఎరుక లేదు. నల్లగొండ, ఖమ్మం లీడర్లు కత్తులు నూరుతున్నారట. కుర్చీని మడత పెట్టి కారు గుర్తు మీద గుద్దితే అన్ని సెట్ అవుతాయని కేటీఆర్ అన్నారు.
ఎన్నికల ముందు తియ్యటి పుల్లటి మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు హామీల అమలుపై నిలదీస్తే.. పైసలు ఎప్పుడిస్తవ్ అంటే నా దగ్గర పైసల్లేవు నన్ను కోసుకు తింటారా అని అంటున్నడు. నన్ను దొంగలాగా చూస్తున్నారు ఢిల్లీల్లో అని రేవంత్ మాట్లాడుతున్నడు. చాలా మంది సీఎంలను చూశాం. చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్‌ను చూశాం. ఇంత దివాళాకోరు మాటలు మాట్లాడిన సీఎం ఎవరూ లేరు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే దిక్కు లేదు.. ఇంకొకర్ని గెలిపిస్తే ఏం చేస్తడు.. పెళ్లిళ్లకు పేరంటాలకు తిరుగుడు తప్ప, తామేం అభివృద్ధి చేయడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అంటున్నడు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు పెట్టుకున్నాడు 100 కోట్ల కోసం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలకు రూపాయి ఇవ్వనోడు మనకు జూబ్లీహిల్స్‌లో ఇస్తాడా..? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకుండ సతాయిస్తున్నాడు. 10 వేల కోట్లు బాకీ ఉన్నాడు కాలేజీలకు. ఆ పైసలు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలను రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులను పంట్టించుకోవడం లేదు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ మందికి న్యాయం చేసే అవకాశం దక్కింది. సర్వేల్లో సునీత గెలుస్తుంది అనగానే మంత్రి పదవి ఇచ్చిండు అజారుద్దీన్‌కు.. ఎన్నికలు లేనప్పుడు సినిమా వాళ్లను జైల్లో పెట్టిండు. ఇప్పుడు ఎన్నికలు రాగానే అదే సినిమా వాళ్లతో మీటింగ్ పెట్టి కాళ్లు మొక్కడం ఒక్కటి తక్కువ.. బలవంతపు సన్మానం చేయించుకుండు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏక్ పోలీస్ అన్నడు.. కానీ మోసం చేసిండు. పోలీసు కుటుంబాల సభ్యులను పోలీసుల చేత కొట్టించిండు.. ఈ క్రమంలో దుర్మార్గపు ప్రభుత్వానికి పోలీసులు అండగా నిలబడకండి అని విజ్ఞప్తి చేస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు.