KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఏది స్థిరంగా లేదు.. ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం దివాళా తీసిందని చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేసిన అంశంపై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశం ముగిసిన అనంతరం జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎలా అమలు చేస్తారని అడిగితే మాకు తెలివి ఉంది.. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రం.. అందరికి అన్ని చేస్తాం అని సీఎం, డిప్యూటీ సీఎం అన్నారు. ఇప్పుడేమో మాకు చేత కాదు చేతులెత్తేస్తాం అని అంటున్నారు. ఇవాళ దివాళా తీసింది రాష్ట్రం కాదు సీఎం, మంత్రుల బుర్రలు. కాంగ్రెస్ పార్టీ దిమాక్ అని కేటీఆర్ పేర్కొన్నారు.
బాధ్యతగల ప్రతిపక్షంగా ఆర్టీసీ, ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోం. వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారి తరపున డిమాండ్ చేస్తాం. హామీలు ఉల్లంఘించినందుకు సమ్మెకు వెళ్లే అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిష్కారించాలని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పుడు స్థిరంగా ఉందా..? రాజకీయం. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది స్థిరంగా ఉంది.. ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు నిజంగా చెప్పాలంటే. అందుకే 43 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరు. పోనీ రేవంత్ రెడ్డి అయినా సంతోషంగా ఉన్నాడా..? అంటే నిన్న ఆయన ఫ్రస్టేషన్ చూస్తే మాకు కూడా డౌట్ వస్తుంది. నిజంగా ఆయనలో అపరిచితుడు ఉన్నాడు. 18 గంటలు పని చేస్తున్నా అంటున్నడు.. ఉద్యోగులు యుద్ధం ప్రకటించింది పేపర్ చదివే దాకా తెలియదట. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయం పేపర్ చదివితే కానీ తెలియని వ్యక్తికి సీఎంగా ఉండే అర్హత ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.