KTR | హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విజయం. విద్యార్థుల నిస్వార్థ నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే ఈ సానుకూల తీర్పు వచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం మద్దతు ఇచ్చిన ఉద్యమకారులు, సెలబ్రెటీలు, పర్యావరణ ప్రేమికులు, మీడియా, సోషల్ మీడియా.. ప్రతి ఒక్కరికీ విద్యార్థుల తరపున ధన్యవాదాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యలు అన్నీ నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా కోర్టు చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఇది చాలా తీవ్రమైన అంశం అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 16న తదుపరి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగిన సంగతి తెలిసిందే. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించిన కోర్టు.. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు కోర్టు కేసును వాయిదా వేసింది.