KTR | అచ్చంపేట : కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే.. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసే తెలంగాణను బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జనగర్జన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే.. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం కొత్త నవోదయ స్కూల్ ఇవ్వలేదు. నాగర్కర్నూల్ జిల్లాకు నవోదయ స్కూల్ రాలేదు. కాంగ్రెస్, బీజేపీ 12 ఏండ్లుగా సతాయిస్తు వస్తున్నాయి. ఒక గుడికి పైసలు ఇవ్వలేదు.. ఒక బడికి పైసలు ఇవ్వలేదు. కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందే.. ఇద్దరూ కలిసి తెలంగాణను బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా మనల్ని ఎదుర్కొకోలేకనే కేసీఆర్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
ఇద్దరు కలిసి ఉన్నారని ఎందుకు అంటున్నానంటే.. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ రైడ్స్ జరిగాయి ఏడాది క్రితం. ఇంట్లోకి మెషీన్లు పోతున్నాయి.. గుట్టలు గుట్టలుగా పైసలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.. ఏడాది అయినా మంత్రి, ఈడీ నోరు విప్పడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా మాట్లాడం లేదు. ఇద్దరు కలిసిమెలిసి అండర్ స్టాండింగ్లో పని చేసుకుంటున్నారు. అందుకే గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. తెలంగాణలో ఉన్నది జాయింట్ వెంచర్ ప్రభుత్వం.. కాంగ్రెస్, బీజేపీ కలిసి నడుపుతున్న ప్రభుత్వం తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కాబట్టి రెండు పార్టీలను బొందపెట్టేందుకు అచ్చంపేటలోనే బ్రహ్మాండమైన అవకాశం ఉంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సత్తా చూపిస్తారని ఆశిస్తున్నాను అని కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.