హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఏసీబీ విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తనపై నమోదైన కేసుకు సంబంధించి సోమవారం ఆయన ఏసీబీ డీఎస్పీ మాజిద్ఖాన్కు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తనపై గత డిసెంబర్ 18న నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై తుదితీర్పు పెండింగ్‌లో ఉన్నదని గుర్తుచేశారు. డిసెంబర్ 31న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచిందని తెలిపారు. ఏ క్షణంలో అయినా కోర్టు తుదితీర్పు వెలువరించే అవకాశం ఉన్నదని, అయినప్పటికీ తనను సోమవారం విచారణను పిలిచారని పేర్కొన్నారు. ‘కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడంతోపాటు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది’ అని నోటీసుల్లో పేర్కొన్నారని, అయితే ఏ అంశాలకు సంబంధించిన సమాచారం కావాలో, ఏమేం పత్రాలు తీసుకురావాలో ఆ నోటీసుల్లో వివరించలేదని తెలిపారు. కాబట్టి తనవైపు నుంచి ఏయే పత్రాలు కావాలో వివరాలు వెల్లడించాలని కోరారు. ఒక బాధ్యతగల పౌరుడిగా, రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులకు అనుగుణంగా తాను ఏసీబీకి సంపూర్ణంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకొని, తీర్పు వచ్చే వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరారు.