KTR | సూర్యాపేట : ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజోత్సవాల వేడుకల నేపథ్యంలో సూర్యాపేటలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన సమయంలో కేసీఆర్కు మనీ పవర్ లేదు.. మజిల్ పవర్ లేదు.. కుల బలం లేదు.. ధన బలం లేదు.. మీడియా లేదు. ప్రతికూల శక్తులన్నీ హైదరాబాద్లో అడ్డా పెట్టి తొక్కి పారేస్తాం అని హుంకరింపులు. ఈరకమైన వాతావరణంలో ఒక్కడిగా బయల్దేరిన సమయంలో ఆయనకు కొందరు తోడుగా నిలిచారు. అలా ఒక్కొక్క అడుగేసుకుంటూ 14 ఏండ్ల శ్రమించి తెలంగాణను సాధించారు అని కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ మూడు ప్రాతల్లో విజయవంతమైంది. 14 ఏండ్లు ఉద్యమపార్టీగా విశ్వరూపం చూపించాం. ప్రజాస్వామ్యబద్దంగా తమ కోరికలను ఎలా నెరవేర్చుకోవచ్చు అని చూపించాం. తెలంగాణ సాధించాం. ఆ తర్వాత పదేండ్ల పాటు ప్రజలు, రైతుల కోసం ఎలా పని చేయొచ్చు అని చేసి చూపించాం. అభివృద్ధిలో తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపాం. 15 నెలల కిందట అధికారం పోయింది.. ప్రతిపక్షంలోకి వచ్చాం.. ఇక చిట్టి నాయుడు ఏం చెబుతున్నారు తనను బతకనిస్తలేరు అని అంటున్నాడు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఈ గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి 25వ ఏడాదిలోకి వచ్చే నెల 27న అడుగుపెట్టబోతున్నామని కేటీఆర్ తెలిపారు.