KTR | హైదరాబాద్ : అటు పల్లెల్లో.. ఇటు పట్నంలో మొదలైన సాగు, తాగునీటి కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పల్లెల్లో సాగునీళ్లు లేవు.. పట్నంలో తాగునీళ్లు లేవు అని కేటీఆర్ విమర్శించారు. నాడు ఇంటింటికీ నల్లా నీళ్లు
నేడు సాగు, తాగునీళ్లు లేక జనం కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా, గోదావరి నదుల నిండా నీళ్లు పారుతున్న, వాటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టిందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం గేట్లు తెరిచిపెట్టారు, పాలమూరు రంగారెడ్డి పనులు పడావుపెట్టారు అని ధ్వజమెత్తారు. సర్కారు మోసానికి సాక్ష్యంగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయన్నారు. బోర్లు అడుగంటి పోయాయని, పొలాలు పడావున పడ్డాయన్నారు.
వ్యవసాయానికే కాదు .. వ్యక్తిగత అవసరాలకు నీళ్లు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. సాగునీళ్లను వదిలిపెట్టి తాగునీళ్లకూ ప్రభుత్వం బలిపెడుతుందన్నారు. రెండు రోజులు ఎదురుచూసినా రాని ట్యాంకర్లు. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా స్పందించని అధికారులు. సర్కారు నిర్వహణ లోపంతో రోజుకు ఏకంగా ఎనిమిది వేల ట్యాంకర్ల డిమాండ్. పాలన చేతగాక వ్యవస్థలు పతనమవుతున్నాయి. నీళ్లు కొనలేక, పాట్లు పడలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ పాపం ప్రజలకు శాపంగా మారిందన్నారు. చివరగా జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ నినదించారు.