మహబూబ్నగర్ : బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిని చూస్తావుంటే తనకు కడుపు నిండిన భావన కలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఏం చేశారని ప్రశ్నించారు.
నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల ఉమ్మడి నాయకులంతా కలిసి ఇవాళ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడాన్ని మెచ్చుకున్నారు. ‘దాదాపు నాలుగైదు కిలోమీటర్లు ర్యాలీ తీశారు. నాకు ఆ ర్యాలీని చూస్తావుంటే 2028 ఎలక్షన్ అయిపోయింది.. మనం గెలిచినాము.. కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయినారు అన్నట్లుగా అనిపించింది’ అన్నారు. ఆరేడు వేల మోటార్ సైకిళ్లతోటి బ్రహ్మాండంగా ర్యాలీ తీసిండ్రని పార్టీ శ్రేణులను ప్రశంసించారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘ర్యాలీగా వస్తుంటే శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలో మనం నిర్మించిన ఒక్కో ప్రభుత్వ భవనాన్ని చూపిస్తూ వచ్చాడు. అవన్నీ చూస్తే నాకు కడుపు నిండినట్లు అయ్యింది. మహబూబ్నగర్ పట్టణం ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నదో మీరందరూ చూస్తా ఉన్నారు. ఒక్క మహబూబ్నగరే కాదు నారాయణపేటగానీ, జడ్చర్ల అభివృద్ధిగానీ, రహదారుల విస్తరణగానీ, ఫ్లైవోర్లుగానీ, రహదారుల వెంట వీధి వ్యాపారుల కోసం కట్టిన స్ట్రీట్ వెండింగ్ జోన్లుగానీ నాడు మనం చేసిన అభివృద్ధికి నిదర్శనం’ అన్నారు.