హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ సంవిధాన్ ర్యాలీ చేస్తానంటుంటే.. పీసీసీ అధ్యక్షుడు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుని అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామని ప్రకటిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరిగేది ఇందుకేనా రాహుల్‌గాంధీ? అంటూ ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు త్వరలో మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించిన పేపర్ క్లిప్పింగ్‌ను కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమేనా మీ సంవిధాన్ బచావో నినాదం అంటూ నిలదీశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎంత గొప్పమార్గం ఎంచుకున్నారు రాహుల్ గాంధీ? అంటూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్‌కు చెప్పే ధైర్యం లేదు.. వారూ చెప్పుకోలేరు ;ఆ 10 మంది ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తున్నది : కేటీఆర్
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్‌కు చెప్పే ధైర్యం లేదు. .వారు చెప్పుకోలేరు. పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తున్నది’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగిన జరిగిన సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో చెప్పుకోలేని దయనీయస్థితి నెలకొన్నదని విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఉమ్మడి కరీంనగర్ వేదిక సాక్షిగా ఎమ్మెల్యే సంజయ్‌ను నిలదీసిన వైనాన్ని కేటీఆర్ అభినందించారు.
అలిశెట్టికి కేటీఆర్ నివాళి
తెలంగాణ మట్టివాసనలు, మానవత్వపు పరిమళానికి నిట్టనిలువు ప్రతీక ప్రముఖ కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘మరణం నా చివరి చరణం కాదు/ మౌనం నా చితాభస్మం కాదు.., నిర్విరామంగా, నిత్యనూతనంగా / కాలం అంచున చిగురించే / నెత్తుటి ఊహను నేను’ అని ప్రకటించిన ధీశాలి అలిశెట్టి అని కొనియాడారు. అలిశెట్టి జయంతి, వర్ధంతి సందర్భంగా కేటీఆర్ ఎక్స్‌వేదికగా ఘన నివాళి అర్పించారు.