మహబూబాబాద్ : ‘సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్‌రెడ్డి ఇచ్చిన దొంగ హామీలను తూర్పారబట్టారు. రేవంత్‌రెడ్డి మాయమాటలు నమ్మి ప్రజలు ఓటేసిండ్రని, ఇప్పటికైనా ఓటు విలువ తెలుసుకోవాలని హితవు పలికారు.
కేటీఆర్ ఏమన్నారంటే.. ‘బీఆర్ఎస్ హయాంలో ఏడాది రెండుసార్లు రైతులు నాట్లుపెట్టే సమయంలో రైతుబంధు పడేది. మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమయ్యేవి. కేసీఆర్ చెప్పిండంటే రైతుబంధు పడుతది అనే నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం లేదు. రైతుబంధు పడుతదో.. పడదో.. అని రైతులు ఎదురుచూసే దుస్థితి ఉన్నది. రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ప్రజలు, రైతులు కాంగ్రెసోళ్లను గెలిపించిండ్రు. ఇప్పటికైనా ఓటు విలువ తెలుసుకోవాలి. దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
‘ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్‌రెడ్డి ఎన్ని దొంగ మాటలు చెప్పిండో మీరందరు చూసిండ్రు. మొత్తం 420 హామీలు ఇచ్చి మాట తప్పిండు. కేసీఆర్ రైతులకు రైతుబంధు రూ.10 వేలే ఇస్తున్నడు, నేను గెలిస్తే రూ.15 వేలు ఇస్త అన్నడు. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్త అన్నడు. ఇవన్నీ నూరు రోజుల్లనే చేస్త అన్నడు. కేసీఆర్ రైతు కూలీలను పట్టించుకుంటలేడు, నేను జాబ్ కార్డు ఉన్న ప్రతి రైతుకూలీకి ఆత్మీయ భరోసా కింద నెలకు రూ.1000 ఇస్త అన్నడు. కానీ ఇండ్ల ఒక్కటన్నా చేసిండా..?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.