KTR | సూర్యాపేట : అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫినిక్స్ పక్షిలా పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు తలవంచి నమస్కరిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ మనకు ఉద్యమం కొత్త కాదు. అధికారం కొత్త కాదు. ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. ఇవాళ అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు. నేను, జగదీశ్ రెడ్డి పదేండ్లు మంత్రిగా పని చేశాం. ఇక్కడున్న వారిలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు.. ఇలా రకరకాల పదవులు వచ్చాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది మన కోసం కాదు.. ప్రజల కోసం. టీఆర్ఎస్ పుట్టుక చరిత్రలో అనివార్య పరిస్థితిలో వచ్చింది. ఇవాళ కూడా బీఆర్ఎస్ అధికారం కోరుకోవడం.. తెలంగాణకు చారిత్రక అవసరం. కర్కశ కాంగ్రెస్ పాలన పీడ వదిలించుకోవాలంటే గులాబీ జెండాతోని అయితదని ప్రజలు గుర్తించారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క సూర్యాపేట గెలిచింది. పార్లమెంట్లో ఓడిపోయాం. చాలా మంది అన్నారు అయిపోయింది వీళ్ల పని అని. పార్టీ మూతపడుతది అని మాట్లాడారు. ఒక ఫినిక్స్ పక్షిలాగా ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతో ముందుకు సాగుతదో.. అదే విధంగా ఇవాళ కదం తొక్కి అటు కాంగ్రెస్కు, ఇటు బీజేపీకి కాళరాత్రులు చూపెడుతున్న మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. మేం ఒక్క నిరసనకు పిలుపునిస్తే కేసులు పెట్టినా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా మనస్కారం చేస్తున్నా. మీరు గొప్ప పోరాటం చేస్తున్నారు అని కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇవాళ ఒక వికృతమైన సీఎంను చూస్తున్నారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు. అదృష్టం బాగుంది.. పర్సనాలిటీ పెంచుకుంటడు అనుకున్న రేవంత్ రెడ్డి. 54 ఏండ్లకే జాక్ పాట్ తగిలింది. తంతే గారెల బుట్టలో పడ్డట్టు ముఖ్యమంత్రి అయిండు. సరే అదృష్టం బాగుంది పర్సనాలిటీ పెంచుకుంటడు అనుకున్న. కానీ రేవంత్ రెడ్డి పర్సనాలిటీ మీద ఇంట్రెస్ట్ లేదు.. పర్సెంటేజీలు పెంచుకునుడు మీద ఉంది. ఢిల్లీకి మూటలు పంపాలి.. పదవి కాపాడుకోవాలి.. దాని మీదనే రేవంత్ రెడ్డి దృష్టి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.