KTR | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేటలో మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్కావడంతో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందటం, 120 మందికిపైగా అస్వస్థతకు గురవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ సర్కారు దేనని ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇంటింటికీ సరఫరా అయిన మిషన్ భగీరథ నీటిని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.
‘తెలంగాణ అంతటా తాగునీటి సరఫరా కోసం కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తిచేసింది. కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి ప్రజలందరికీ తాగునీరిచ్చే ఈ ప్రాజెక్టును కూడా రేవంత్ సర్కారు సరిగ్గా నిర్వహించలేకపోతున్నది’ అని విమర్శించారు. సంజీవన్రావుపేట ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న వారికి అవసరమైన సాయం అందించాలని, రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.