KTR | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దేశంలో కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిల్వలున్న పరిస్థితుల్లో తన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచమంతా ఆశ్చర్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కొనియాడారు. అసెంబ్లీలో సోమవారం మాజీ ప్రధానికి సంతాపం తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. అనవసరపు డాంభికాలు, ఆర్భాటాలు, హడావుడి లేకుండా సింపుల్ లివింగ్.. హై థింకింగ్ అనే మాటకు పర్యాయపదంగా మన్మోహన్సింగ్ను చెప్పుకోవచ్చని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏడాదిన్నరపాటు వారి క్యాబినెట్లో కేంద్రమంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత, ఉద్యమానికి ఉన్న బలం, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి.. అన్నీ మన్మోహన్‌కు అర్థమయ్యాయి. కాబట్టే అనివార్య పరిస్థితుల్లో ఆయన నాయకత్వంలోనే తెలంగాణ ఏర్పడింది’ అని పేర్కొన్నారు.
ఎన్నడూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా సంసరణల బాట నుంచి వెనకి తగ్గలేదని, ఆయనను ‘సైలెంట్ ఆరిటెక్ట్ ఆఫ్ మాడ్రన్ ఇండియా’ అని పిలువవచ్చని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మన తెలుగు బిడ్డ.. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు గురించి కూడా గుర్తుచేసుకోవాలని చెప్పారు. మన్మోహన్సింగ్ గొప్పదనాన్ని, సామర్థ్యాన్ని, తెలివితేటలను గుర్తించే పీవీ నర్సింహారావు రాజకీయాల్లోకి తీసుకువచ్చి నేరుగా ఆర్థిక మంత్రిగా నియమించారని గుర్తుచేశారు. ‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నేను, మా పార్టీ రాజ్యసభ సభ్యుల బృందం ఢిల్లీకి వెళ్లి మన్మోహన్‌సింగ్‌కు ఘనంగా నివాళులర్పించాం. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నాం. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించాం. మా సానుభూతి వ్యక్తం చేశాం. ఢిల్లీలో మన్మోహన్‌సింగ్‌కు జరిగిన గౌరవప్రదమైన వీడోలు మన పీవీకి జరుగలేదనే బాధ కలిగింది. మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని, విగ్రహం పెడతామని సీఎం ప్రకటించారు. మేం స్వాగతిస్తున్నాం. ఆయా కార్యక్రమాల్లో మేం కూడా పాల్గొంటాం. మనవాడైన పీవీ నరసింహారావుకు కూడా ఢిల్లీలో స్మారకం ఏర్పాటుచేయాలని తెలంగాణ శాసనసభ తీర్మానం చేయాలి. మన తెలుగు, తెలంగాణ బిడ్డకు సముచిత గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనే ప్రతిపాదన అసెంబ్లీ నుంచి పంపిస్తే బాగుంటుంది’ అని కేటీఆర్ సూచించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ వేదికగా ప్రశంసించారు. మాజీ ప్రధా ని మన్మోహన్సింగ్ సంతాప తీర్మానంపై మా ట్లాడే సమయంలో తొలుత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి రాజకీయవిమర్శలకు దిగారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సంతాప తీర్మానం సమావేశంలో రాజకీయ విమర్శలకు దిగడం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎంతో హుందా గా వ్యవహరించడంతోపాటు, చక్కగా మాట్లాడారని ప్రశంసించారు.