KTR | హైదరాబాద్ : సంస్కరణశీలి, బహుభాషా కోవిదుడు, కవి, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, నిత్య విద్యార్థి… ఇలా భారతరత్న పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. భారత ప్రధానిగా ఆర్థిక సంస్కరణలను తెచ్చి దేశాన్ని భారీ సంక్షోభం నుండి గట్టెక్కించిన మహా మేధావి పీవీ నరసింహారావు అని కొనియాడారు. తన సొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూసంస్కరణలను ప్రారంభించిన మహనీయుడు పీవీ అని గుర్తు చేశారు.
గురుకుల విద్యాలయాలకు అంకురార్పణ చేసి విద్యారంగానికి ఎనలేని సేవలు చేసిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టింది. నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టడమే కాకుండా.. పీవీ ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపింది. పీవీ తనయ సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది.
నవ భారత నిర్మాత పీవీ మన తెలంగాణ గడ్డపై పుట్టడం మనందరికీ గర్వకారణం. నేడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.