KTR | హైదరాబాద్ : జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ మాస్ లీడర్, డైనమిక్ లీడర్‌గా పని చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శాసనసభలో మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఈ సభలో సోదరుడు, సహచరుడు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తదని కలలో కూడా అనుకోలేదు. జీవించి ఉన్నంతకాలం ఆయన అనారోగ్యం గురించి చెప్పుకోలేదు. గుమ్మనంగా ఉంటూ తన వ్యక్తిగతమైన ఆరోగ్య విషయాలను చాలా రహస్యంగా ఉంచారు. కానీ పబ్లిక్ పరంగా చాలా యాక్టివ్‌గా ఉండేవారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ అంటేనే సంపన్నులు నివసించే ప్రాంతం అని పేరు. కానీ అక్కడ ఉండేది మొత్తం పేద ప్రజలు. బస్తీలతో కూడిన ఏరియా. అలాంటి ఏరియాను మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని కేటీఆర్ కొనియాడారు.
హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో గోపీనాథ్ జన్మించారు. ఇక్కడే చదవుకుని ఉస్మానియాలో డిగ్రీ చేశారు. ఎన్టీఆర్‌కు వీరాభిమానికిగా టీడీపీలో అడుగుపెట్టారు. బషీర్‌బాగ్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నివాసం ఉండేది మేం. ప్రస్తుతం ఉన్న అమర జ్యోతి ముందు ఓ కటౌట్ కనబడేది.. నిలువెత్తు కృష్ణుడు, రాముడు రూపంలో ఎన్టీఆర్ కటౌట్ ఉండేది.. దాని కింద మాగంటి గోపీనాథ్ అని రాసి ఉండేది. అప్పట్నుంచే తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నారు గోపీనాథ్ అని కేటీఆర్ తెలిపారు.
విద్యార్థి దశ నుంచి క్రియాశీలంగా రాజకీయాల్లో ఉన్నారు గోపీనాథ్. ఒక పార్టీని, నాయకుడిని నమ్ముకుంటే.. ఎన్టీఆర్ నాయకత్వంలో.. కేసీఆర్ నాయకత్వంలో కష్టమొచ్చినా నష్టమొచ్చినా పని చేశారు. ఎమ్మెల్యేగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు. అది గోపీనాథ్‌కు సాధ్యమైంది. మాదాపూర్ ఏరియాలో చాలా చిన్న ఇంట్లో గోపీనాథ్ నివాసం ఉన్నారు. గోపీనాథ్ ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉండేవారు. ముగ్గురు పిల్లలు 21 ఏండ్ల లోపే. ఎవరూ సెటిల్ కాలేదు పెళ్లిల్లు కాలేదు. ఆయన ఇల్లు చూసి బాధపడ్డాం. బతుకమ్మ చీరలను ప్రారంభించే కంటే ముందు.. తన నియోజకవర్గంలో బతుకమ్మ పండుగకు చీర పెట్టే సంస్కృతి తీసుకొచ్చారు గోపీనాథ్. నియోజకవర్గంలో గోపన్న అని పిలుచుకుంటారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యేవారు గోపీనాథ్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఎస్పీఆర్ హిల్స్‌లో ఓ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే.. దాన్ని అడ్డుకుని పిల్లలకు గ్రౌండ్‌గా తీర్చిదిద్దారు. బతుకమ్మ వేడుకలు, రంజాన్, క్రిస్మస్ వేడుకలను ఆ గ్రౌండ్లో నిర్వహించారు. బతికినంత కాలం మాస్ లీడర్‌గా డైనమిక్‌గా ఉన్నారు. స్పందించే గుణం ఎక్కువ గోపీనాథ్‌కు. కేసీఆర్‌కు నమ్మిన విధేయుడిగా పని చేశారు. ఆయన మరణం పార్టీకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటు. గోపీనాథ్ కుటుంబానికి మా పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.