హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కేసీఆర్ అనవాళ్లు లేకుండా చేయడం రేవంత్‌రెడ్డే కాదు.. ఆయన జేజమ్మ తరం కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మే డేను బుధవారం ఘనంగా నిర్వహించగా కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ కట్టించారని, ఒకవేళ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే వీటన్నింటనీ కూల్చాల్సి ఉంటుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మాజీ బాస్ కలిసి మళ్లీ రెండు రాష్ర్టాలను కలిపి అసలు తెలంగాణనే లేకుండా చేస్తే తప్ప కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నది గుర్తుంచుకోవాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర మరవలేనిదని కేటీఆర్ కొనియాడారు. ఉద్యమ సమ యం.. సకల జనుల సమ్మెలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, న్యాయవాదులు అగ్రభాగాన ఉన్నారని చెప్పారు. ఉద్యమంలో కేసీఆర్ బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అని కార్మికులను ఉద్దేశించే అన్నారని గుర్తుచేశారు. కార్మికుల విషయంలో కేసీఆర్ ఎంతో గౌరవంగా ఉంటారని, కరోనా సమయంలో కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మరిచిపోవద్దన్నారు. కార్మికులను చావ గొట్టింది ఇదే మోదీ అని, కార్మికుల కోసం రైళ్లు వేయాలంటే మానవత్వం లేకుండా వ్యవహరించారని చెప్పారు. మోదీ కారణంగానే మనం బతికి ఉన్నామని బీజేపీ నేత అంటుంటారని, మోదీయే కరోనా వ్యాక్సిన్ కనుగొన్నాడని కిషన్‌రెడ్డి అంటాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోదీ దేవుడని ఇంకొకడు అంటాడని, మోదీ దేనికి దేవుడని ప్రశ్నించారు. కార్మికులు, కర్షకులను చావగొట్టినందుకు మోదీ దేవుడా అని నిలదీశారు.
ప్రపంచ వ్యాప్తంగా 2014లో ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లు ఉండేదని, ప్రస్తుతం 84 డాలర్లకు తగ్గినా పెట్రోల్, డిజిల్ ధరలు ఎందుకు పెరిగాయని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ర్టాలకు పన్నుల వాటా ఇవ్వకుండా ప్రధాని మోదీ ప్రత్యేక సెస్‌లు విధించి, సెస్‌ల పేరుతో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి వసూలు చేశారని, ఆ మొత్తంలో రూ.14.50 లక్షల కోట్ల మేరకు అదానీ, అంబానీ సహా కార్పొరేట్ల రుణం మాఫీ చేసేందుకు వాడుకున్నారని, కాకులను కొట్టి గద్దలకు పెట్టారని విమర్శించారు. ఈ విషయం తప్పని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. ఇదే మోదీ ఉచితాలు ఇస్తే అనుచితం అంటాడని, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం అప్పనంగా లక్షల కోట్ల రుణమాఫీ చేస్తాడని దుయ్యబట్టారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే వద్దు అంటాడని, దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే రూ.1.50 లక్షల కోట్లు అవుతుందని, కార్పొరేట్లకు మాఫీ చేసిన మొత్తంతో పదేండ్ల పాటు దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని తెలిపారు. కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టే కరోనా సమయంలో ఒకో కార్మికునికి రూ.500 చొప్పున ఇచ్చి, భోజనం పెట్టి ఉచిత రైళ్లు ఏర్పాటు చేసి ఇండ్లకు పంపించి కేసీఆర్ తన మంచితనాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు, సెర్ప్ ఉద్యోగులు, హోంగార్డులు, సింగరేణి కార్మికులు, చేనేత, గీత కార్మికులకు ఎంతో మేలు చేసిందని, వారి జీతాలను భారీగా పెంచిందని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిందని గుర్తుచేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 73 శాతం పీఆర్సీ అమలు చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులను పింఛను ఇచ్చిందని చెప్పారు. రేవంత్ సరార్ కూడా వచ్చిన నాలుగు నెలల్లోనే చేనేత కార్మికులకు చీరెల ఆర్డర్లు బంద్ పెట్టిందన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని, ఫ్రీ బస్సు తప్పుకాదని, కానీ దాని ఆధారంగా ఉపాధి కోల్పోతున్న ఆటోడ్రైవర్లకు మేలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లనే కార్మికుల అడ్డా అని, కచ్చితంగా కార్మికులకు అండగా ఉంటానని, పార్టీ కార్మిక విభాగాన్ని తానే చూసుకుంటానని ప్రకటించారు. భవిష్యత్‌లో కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు.
సింగరేణి ప్రైవేట్ పరం కావొద్దంటే, ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుషేరుకు అమ్ముకోవద్దంటే, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావద్దంటే, రిజర్వేషన్లు, మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు కాకుండా ఉండాలంటే, గోదావరి నీటిని కావేరికి మళ్లించకుండా అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణను సాధించామని, 10-12 ఎంపీ సీట్లు ఇస్తే మళ్లీ ఏడాది లోపల రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుందని చెప్పారు. కార్మికులు, ఆటో డ్రైవర్లు గట్టిగా అనుకుంటే 10-12 సీట్లు రావడం కష్టం కాదన్నారు. బీజేపీ గెలిస్తే సింగరేణి, నవ, మహారత్నాలు ఇలా అన్నింటినీ అమ్మేస్తుందని, అందుకే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాలన్నారు. కుల, మత, జాతి పేరిట కొట్లాడుకుంటే మన దేశం ముందుకుపోదని, వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే సన్నాసులకు, అరచేతిలో వైకుంఠం చూపిన ఛోటేభాయ్, పదేండ్లు మోసం చేసిన బడేభాయ్కి కచ్చితంగా బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు నారాయణ, మారయ్య, దానకర్ణాచారి, శ్రీనివాస్, శివశంకర్, ప్రభాకర్, బాబుమీయా పాల్గొన్నారు.