కేసీఆర్ హయాంలో 72 లక్షల మంది రైతులకు రైతుబంధు వేశాం. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నయ్. రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మనం అడగాల్సింది అధికారులను కాదు. రుణమాఫీ ఎందుకు కాలేదని ఓట్లు వేసిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ గల్లా పట్టి నిలదీయాలె.
మాటలు చెప్పినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపడం. చెట్టుకు కట్టేసి కొడుతా, తొండలు జొర్రకొడుతా అని గతంలో రేవంత్ మాట్లాడిండు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే అదే పని ఆయనకు ప్రజలు చేస్తారు. ఒక రుణమాఫీ మాత్రమే కాదు.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్ల మీద కూడా వెంటపడుతం.
KTR | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఆగస్టు 15లోగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్టేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తిగా రుణమాఫీ చేయకుండా దైవద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. రుణమాఫీపై నమ్మించి మోసం చేసిన సిగ్గులేని కాంగ్రెస్ సర్కారును గల్లాపట్టి అడగాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రజలు తనను నమ్మరని భావించి ఎకడికిపోతే అకడ దేవుళ్లపై ఒట్టేసి ఆగస్ట్టు 15 నాటికి రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులతో ఓట్లు వేయించుకొని రేవంత్‌రెడ్డి అవతలపడ్డారని మండిపడ్డారు. ‘పంద్రాగస్టులోగా రైతులందరికీ రుణమాఫీ చేయలేదని తేలిపోయింది. ఎప్పటిలోగా వందశాతం రుణమాఫీ చేస్తావో గడువు తేదీని ప్రకటించు’ అని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. రుణమాఫీకి రూ.49 వేల కోట్లు అయితయని తొలుత చెప్పి, చివరికి రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని, ఎక్కడి రూ. 49 వేల కోట్లు, ఎక్కడి రూ.7,500 కోట్లు అని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి మోసగించిన కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ గల్లాపట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ అయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతోపాటు డిక్లరేషన్లపైనా వెంటపడుతూనే ఉంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు నిరసన దీక్షలో కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి పాల్గొని ప్రసగించారు.
‘చేవెళ్ల చెల్లెమ్మగా పిలుచుకొనే వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలోని నరోడా గ్రామానికి మూడు రోజుల కిందట పెండ్లికి వెళ్లిన. అకడ గ్రామంలో కళ తప్పిందని ప్రజలు చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బతులుకు ఆగమైనయ్ అని అంటున్నరు. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయింది. రేవంత్‌రెడ్డి చెప్పుడు మాటలు విని ఆగమైపోయినం అని అంటున్నరు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘డిసెంబర్ తొమ్మిదినాడే తొలి సంతకం రూ. 2 లక్షల రుణమాఫీపై పెడతానని సోనియాగాంధీ మీద ఒట్టేసి రేవంత్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయాలే అన్నట్టుగా మాట మార్చారు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశాం. ఇదే రేవంత్‌రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టారు. 2 లక్షల రుణమాఫీ కోసం రూ.49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు చెప్పారు. దాంతో తప్పించుకొనేందుకు నాటినుంచి చావు తెలివితేటలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. ఒక ఏడాది కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్లు కట్టేస్తా.. అని 9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడారు. ఆ తర్వాత జూలైలో మంత్రివర్గంలో చర్చించి ఏదోవిధంగా కటింగ్ పెట్టాలని సీఎంకు మంత్రులు సలహా ఇచ్చారు. దాంతో రైతుల రుణమాఫీపై ఆంక్షలు మొదలుపెట్టారు. అందుకే క్యాబినెట్లో మీటింగ్నాటికి దాన్ని రూ.31 వేల కోట్లకు తగ్గించారు. ఇక బడ్జెట్లో రుణమాఫీకి రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. దీని మీద గట్టిగా అడిగితే రేవంత్‌కు చెప్ప చేతకాలేదు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని నడపడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. చెట్టుకు కట్టేసి కొడతా, తొండలు జొర్రకొడతా అని గతంలో రేవంత్ అన్నారు. ఇప్పుడు హామీలు నెరవేర్చకుంటే ప్రజలే ఆయనకు ఆ పనిచేస్తారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో మీరే ఆలోచించాలి. అన్ని ప్రాజెక్టులను రద్దు చేసి ప్రజలను ఆగం చేస్తుండు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు.. భారత రైతు సమితి కూడా. మొత్తం రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదు. రుణమాఫీ మాత్రమే కాదు, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లపైనా వెంటపడతాం.
రేవంత్‌రెడ్డికి పాలన చేతనైతలేదని, ఇంట్లో దోమలు కుడుతున్నాయని, బయట కుక్కలు కరుస్తున్నాయని సబితక చెప్తే కోపం వచ్చి మహిళా శాసనసభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, మహిళలపై లైంగికదాడులు పెరిగాయని, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని అంటే సీఎం జీర్ణించుకోలేకపోయారని విమర్శించారు. ‘ఒక ఆడబిడ్డ నాలుగున్నర గంటలు నిలబడి మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏడిపించి దుర్మార్గంగా వ్యవహరించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సబిత లాంటి నేతను నిండు శాసనసభలో అవమానించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేని కారణంగానే ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం సభలో రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని సీఎం చెప్పడంతో మొత్తం రైతులు తిరగబడ్డారు. దీంతో రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది. నీ సొంత ఊళ్లో రైతులకు వంద శాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెప్తే రాజీనామా చేస్తా అని నేను సవాల్ చేసినా. నా సవాల్‌కు సమాధానం లేదు. స్పందన లేదు. 49 వేల కోట్ల నుంచి 17 వేల కోట్లకు తీసుకొచ్చారు. అదన్నా నిజం అనుకున్నాం. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు రూ.7,500 కోట్లు మాత్రమే వేసినం అని చెప్పారు. ఎకడ రూ. 49 వేల కోట్లు? ఎకడి రూ.7,500 కోట్లు? అంటే రూ.7500 కోట్లతో దీన్ని ఇకడికే ఖతం చేద్దామని చూస్తున్నారు. రైతన్నలు ఆలోచించాలి. మోసం చేసినోన్ని గల్లా పట్టి నిలదీయాలి’ అని పిలుపునిచ్చారు.
ఇప్పుడు రుణమాఫీలో కటింగ్ పెడితే వచ్చే రైతుభరోసాలో కూడా రేవంత్‌రెడ్డి కటింగ్‌లు పెడతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలు, రైతులు ఇప్పుడు వదిలిస్తే తర్వాత కూడా ఇదే విధంగా కోతలు పెట్టుకుంటుపోతారని తెలిపారు. ‘మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాం. రుణం తీసుకోని రైతులు ఎవరైనా ఉంటే ఉరికిపోయి తెచ్చుకోండి’ అని రేవంత్‌రెడ్డి ఎన్నికల సభలో చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం రుణంమాఫీ అయితదని అనుకున్న అని నర్సాపూర్‌లో ఒక రైతు చెప్పాడు. 9 నెలల లేటుకుగాను వడ్డీ అడుగుతున్నారంట. రైతుల మిత్తితోసహా ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నదే మన డిమాండ్. కేసీఆర్ ఉన్నప్పుడు 72 లక్షల మంది రైతులకు రైతుబంధు వేశాం. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నయ్. రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మనం అడగాల్సింది అధికారులను కాదు. కాంగ్రెస్ నాయకులను అడగాలె. ఇవ్వాళ ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏం పాపం చేశారు. నిజంగా రుణమాఫీ వంద శాతం అయితే మహిళా జర్నిస్టులపై దాడులు చేయించావ్. ముఖ్యమంత్రి పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులను కొట్టి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తారా?’ అని కేటీఆర్ నిలదీశారు.
కేసీఆర్ ఉన్నప్పుడు 72 లక్షల మంది రైతులకు రైతుబంధు వేశాం. అప్పుడు లేని ఆధార్ సమస్యలు, సాంకేతిక సమస్యలు, రేషన్‌కార్డు సమస్యలు, బ్యాంకు సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నయ్. రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెప్తున్నరు. మనం అడగాల్సింది అధికారులను కాదు.. కాంగ్రెస్ నాయకులను.
రుణమాఫీపై ప్రజలు తాము ఓట్లు వేసిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలను గల్లా పట్టి నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారులు చుట్టూ తిరగాల్సిన గర్జు మనకెందుకు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే తమ తరఫున పోరాటం చేయాలని రైతులు అడగాలని సూచించారు. ఇవ్వాళ్టి పోరాటం మొదటి అడుగు మాత్రమేనని, రైతులందరికీ మొత్తం రూ. 2 లక్షలు రుణంమాఫీ చేసే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘మాటలు చెప్పినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపటం. చెట్టుకు కట్టేసి కొడుతా, తొండలు జొర్రకొడుతా అని గతంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ఆయన చెప్పిన హామీలు నేరవేర్చకుంటే అదే పని ఆయనకు ప్రజలు చేస్తారు. ఏ ఊరిలోకి అయిన సరే వెళ్లి అడుగుదాం ఒకరైనా నీ పాలనను మెచ్చుకుంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీరే ఆలోచించాలి. అన్ని ప్రాజెక్టులు రద్దు చేసి ప్రజలను ఆగం చేస్తుండు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు. భారత రైతు సమితి కూడా. మొత్తం రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదు. ఒక రుణమాఫీ మాత్రమే కాదు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు మీద కూడా వెంటపడుతాం. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీకి సంబంధించి అయిన వెంటాడటమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఒకటై కాంగ్రెస్ 420 హామీలను ప్రజల ముందుపెడదాం. రేవంత్‌రెడ్డి లాగా మనం బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే’ అని హెచ్చరించారు.
అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ దొంగ పార్టీ అని మాజీ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల అబద్ధాలు నమ్మి మోసపోయామని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్.. పదేండ్లు కష్టపడి రాష్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే 8 నెలల్లోనే రేవంత్‌రెడ్డి భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ నాడు పరిశ్రమలు రాష్ర్టానికి తీసుకొస్తే నేడు ఆ పరిశ్రమలు బయటకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ రైతు సంక్షేమ పార్టీ అని చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరుగలేవని, ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యం అయ్యాయని చెప్పారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అంశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నోటికొచ్చినట్టు రేవంత్‌రెడ్డి మాట్లాడటం నీచశైలికి నిదర్శమని మాజీ మంత్రి, చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయాలనుకోవడం మూర్ఖత్వమని విమర్శించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్ పేరు ఉంటదని చెప్పారు. మనం తాగే భగీరథ నీళ్లలో, మన ఊళ్లో ఏపుగా పెరిగిన చెట్ల నీడల్లో కేసీఆర్ కనిపిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఇలా ఎప్పుడైనా రుణమాఫీపై దరఖాస్తులు ఇచ్చా మా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో రుణమాఫీ కాని రైతుల జాబితాను సిద్ధం చేద్దామని, వారం, పది రోజల్లో నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతుల జాబితాను ఈ రోడ్డు మీదుగా వెళ్లే రేవంత్‌రెడ్డి ముఖాన కొడదామని పేర్కొన్నారు. ఇవ్వాళ మహిళా జర్నలిస్టులను కొట్టిపించిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాల బీఆర్ఎస్ వెంటాడుతూనే ఉంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా అధికారిక నివాసాన్ని వాడుకుంటారని, ప్రైవేటు హౌస్ వెనుకడోరు నుంచి ఎవరొస్తున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ రేవంత్‌రెడ్డిని నిలదీశారు. వెనుకడోరు నుంచి వచ్చి ఎవరెవరు ముఖ్యమంత్రిని కలుస్తున్నారని ప్రశ్నించారు. అదానీలు, అంబానీలకు వెనుకడోరు తీస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాయమైనపోయిన పచ్చజెండాలు ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎలా రెపరెపలాడాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు, రైతులకు కుచ్చుటోపీ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్తిక్‌రెడ్డి, పట్నం అవినాశ్‌రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.