ఈ ఎన్నికల్లో చెయ్యి గుర్తోడు గెలిచినా, పువ్వు గుర్తోడు గెలిచినా సింగరేణిని అదానీకి అమ్మేస్తరు.. జనవరిలోనే రేవంత్‌రెడ్డి స్విట్జర్లాండ్ పోయి ఒప్పందం చేసుకున్నడు.. దీనికి ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నయి. ఆ ఇద్దరూ కలిసి సింగరేణిని అదానీకి రాసిచ్చే పనిలో ఉన్నరు. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందులో ఉండే కార్మికులు ఈ విషయాన్ని యాదిపెట్టుకొని సింగరేణిని రక్షించే బీఆర్ఎస్కు ఓటెయ్యాలె.
– కేటీఆర్
KTR | మంచిర్యాల, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుజూరాబాద్: రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ పార్టీల మెడలు వంచి సింగరేణిని కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ గెలుపు కోరుతూ హుజూరాబాద్‌లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అత్యధిక సీట్లలో బీఆర్ఎస్ గెలిస్తే ఆరు నెలల్లో మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని పునరుద్ఘాటించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్లంతా బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో పదేండ్ల బీజేపీ పాలన విషంతో సమానమని, రాష్ట్రంలో 150 రోజుల కాంగ్రెస్ పాలన అబద్ధాలమయమని, పదేండ్ల కేసీఆర్ పాలనే నిజం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ను మరోసారి నమ్మి మోసపోద్దని కోరారు. ఎంపీగా బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప చేసిందేమీలేదని విమర్శించారు. ఈ ప్రాంతం కోసం కొట్లాడే వినోద్‌కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కుర్చీ పీఠం ఎక్కేందుకు రేవంత్‌రెడ్డి రైతు భరోసా, రుణమాఫీ, రూ.500 బోనస్, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, సూటీలు, మహిళలకు రూ.2500, రూ.4 వేల పింఛన్ వంటి మస్తు ముచ్చట్లు చెప్పి, ఒకటైనా అమలు చేసిండా? అని ప్రశ్నించారు.
హుజూరాబాద్ రోడ్‌షోలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. చెన్నూరులో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్‌పై 34 శాతం పన్నులు వేసిండు.. ప్రతి వాహనదారుడి నుంచి పదేండ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని కేటీఆర్ తెలిపారు. ఆ రూ.30 లక్షల కోట్ల నుంచే రూ.15 లక్షల కోట్లను అదానీకి, అంబానీకి రుణమాఫీ చేశారని విమర్శించారు. నేను చెప్పింది తప్పని బీజేపీ వాళ్లు రుజువు చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చెన్నూరులో పెట్టిపోతా.. అని కేటీఆర్ సవాల్ విసిరారు. నేను చెప్పింది అక్షర సత్యమని ఆయన స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని మోదీ గ్యారెంటీలు ఏమయ్యాయో తెలుసుకోవాలని దేశమనుకుంటున్నదని కేటీఆర్ తెలిపారు. మోదీ గ్యారెంటీ అనే బీజేపీ నినాదంపై శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. మోదీ హామీలకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్ పోస్ట్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు , ఐదు ట్రిలియన్ల ఎకానమీ , బుల్లెట్ ట్రైన్, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు హామీలేమయ్యాయని ప్రశ్నించారు.