KTR | కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే అదే పరిస్థితి తేవటం శోచనీయమని అన్నారు. ఈఆర్సీ ఛైర్మన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని.. ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చే ప్రతిపాదనలను తిరస్కరించాలని మిమ్మల్ని కోరుతున్నా అని అన్నారు. విద్యుత్ వ్యాపార వస్తువుగా చూడవద్దని.. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా భావించాలని కోరారు.
విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలోని సెస్ అనేది చాలా ప్రతిష్టాత్మక సంస్థ అని కేటీఆర్ తెలిపారు. దేశంలో సహకార రంగంలో ఉన్న చాలా తక్కువ విద్యుత్ సంస్థల్లో సెస్ ఒక్కటి అని చెప్పారు. మా నేతృత్వంలోని ఇక్కడి సెస్ పాలక వర్గం బ్రహ్మండంగా పనిచేస్తోందని అన్నారు. డిస్కంలతో పోల్చితే మా సెస్ పనితీరు 100 శాతం మెరుగు అని గర్వంగా చెబుతున్నా అని అన్నారు. గతంలో సెస్ ను రాష్ట్ర ప్రభుత్వంలోని సంస్థల్లో కలపాలని ప్రయత్నిస్తే ఇక్కడి ప్రాంత వాసులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. వ్యవసాయ విద్యుత్‌ను 5 నుంచి 7.5 హెచ్‌పీకి పెంచాలని.. 7.5 హెచ్‌పీకి సబ్సిడీ ఇవ్వాలని కోరారు.
గతంలో ఎన్పీసీడీఎల్ సగటు ధర నిర్ణయించేదని.. కానీ ఆ తర్వాత బల్క్ సప్లయ్ టారిఫ్ ఆధారంగా నిర్ణయిస్తోందని.. సర్ ఛార్జీ కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గౌరవ కమిషన్ సెస్ కొనుగోలు చేసే విద్యుత్‌ను 965.26 MUగా నిర్ధారించారని.. కానీ వాస్తవానికి 2023-2024 సంవత్సరానికి సెస్ కొనుగోలు చేసిన విద్యుత్ 1133.52 MUలు. అంటే.. 168.26 MUలు అదనమని తెలిపారు. అదనపు యూనిట్లు ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు. సెస్ ను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిపుష్టమైన సబ్సిడీ ఇస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బు ప్రభుత్వం నుంచి సంస్థకు వచ్చే విధంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేతన్నల సమస్యలు తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు.
సిరిసిల్లలో నేతన్నల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం వంటి ఆర్డర్ ఇక్కడి నేతన్నలకు ఇచ్చామని గుర్తుచేశారు. వర్కర్ టూ ఓనర్ పథకం కోసం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేశామని.. అప్పెరల్, టెక్స్ టైల్ పార్క్ లను బలోపేతం చేశామని.. మరమగ్గాలను మోడ్రనైజేషన్ చేశామని తెలిపారు. గత పదేళ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగిపోయాయని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 10 మందికి పైగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో 10 హెచ్ పీ ల వరకు మాత్రమే సబ్సిడీ ఉందని.. దాన్ని 30 హెచ్ పీ వరకు పెంచాలని కోరారు. సిరిసిల్లను మరో తిరుపూర్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వటం లేదని అన్నారు. వారికి ఆర్డర్లు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని ఈఆర్సీ ఛైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. మానవీయ కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్న 10 హెచ్ పీ సబ్సిడీని 30 హెచ్ పీ ల పెంచాలని కోరారు. మొత్తంగా ప్రజలపై 18 వేల కోట్ల భారాన్ని మోపాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. అదే విధంగా డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. సెస్ ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ తరఫున సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి బహిరంగ విచారణను మా సిరిసిల్లలో నిర్వహించినందుకు ఈఆర్సీ ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.