Auto Driver Ramesh | హైరరాబాద్/ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు శనివారం ఆటో ఎక్కారు. యూసుఫ్‌గూడ నుంచి తెలంగాణభవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నామని, కనీసం ఆటో కిస్తీలు చెల్లించలేకపోతున్నామని, తోటి ఆటో డ్రైవర్లు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆటో డ్రైవర్ రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన కేటీఆర్ భరోసా నింపారు.
చలో తెలంగాణభవన్ వరకు తీసుకెళ్లు..
హైదరాబాద్ యూసఫ్‌గూడలోని మహమూద్ హౌస్ గ్రాండ్ గార్డెన్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నాయకుల నియోజకవర్గ సమీక్ష శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్.. సమావేశం పూర్తయ్యాక నేరుగా ఆ హాలు నుంచి బయటకొచ్చి అక్కడ ఆగి ఉన్న ఆటోలో ఎక్కారు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆటో డ్రైవర్ శాతం రమేశ్ ఒక్కసారిగా కేటీఆర్‌ను చూసి మురిసిపోయాడు. సార్.. సార్.. అంటూ సంతోషపడ్డాడు. ఆటో డ్రైవర్ భుజం తడుతూ చలో తెలంగాణభవన్ వరకు తీసుకెళ్లు.. అంటూ చెప్పడంతో ఆ డ్రైవర్ తన ఆటోను తెలంగాణభవన్ రూటుకు మళ్లించాడు. ఈ ప్రయాణంలో కేటీఆర్ ఆటో డ్రైవర్ల స్థితిగతులను తెలుసుకున్నారు. కేటీఆర్‌కు, ఆటో డ్రైవర్ రమేశ్‌కు మధ్య ఆసక్తికర చర్చ కొనసాగింది.
కేటీఆర్: బాస్.. ఏం పేరు?
ఎప్పట్నుంచి ఆటో నడుపుతున్నావు?
ఆటోడ్రైవర్: సార్.. నా పేరు శాతం రమేశ్. 25 ఏండ్ల నుంచి ఆటో నడుపుతున్న.
కేటీఆర్: మీది ఏ ఊరు? కుటుంబ పరిస్థితి ఏంటి?
ఆటోడ్రైవర్: మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మోటకొండూర్ సార్. నాకో కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్లు కాలేజీకి వెళ్లారు సార్.
కేటీఆర్: ఏమైనా సమస్యలు ఉన్నాయా?
ఆటో డ్రైవర్: సార్.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక మా బతుకులు రోడ్డున పడ్డాయి. ఉపాధి కోల్పోయాం. తోటి డ్రైవర్లు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎలా బతకాలో తెలియడం లేదు సార్. మీరే ఏదైనా చెయ్యాలి సార్. ఊళ్లల్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది సార్. గిరాకీ లేక ఈఎంఐలు చెల్లించలేక నరకం చూస్తున్నాం సార్. ఇక్కడ ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం.
కేటీఆర్: ధైర్యంగా ఉండండి. ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవొద్దు. మీ ఆటో డ్రైవర్ల సమస్యలపై నివేదిక తెప్పించుకున్నాం. తప్పకుండా మీ సమస్య పరిష్కారమయ్యేలా మా పార్టీ తరఫున పోరాడుతాం.
ఆటో డ్రైవర్: మాకు మీపైనే నమ్మకం ఉన్నది సార్.
కేటీఆర్: ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు?
ఆటో డ్రైవర్: సార్.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన మాదిరిగానే మా ఆటోలో కూడా డిజిటల్ మిషన్ ఏర్పాటుచేసి మహిళలకు ఉచిత ప్రయాణ కార్డు ఇచ్చి ఆటోలో కూడా ఉచితమని చెప్పాలి. మా ఆటోలో ఎంతమంది మహిళలు ఎక్కుతారో మిషన్‌లో నిక్షిప్తం అవుతాయి కాబట్టి వాటి ఆధారంగా వారానికో.. నెలకో మాకు డబ్బులు చెల్లిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్.
కేటీఆర్: ఆలోచన బాగుంది. గతంలో, ఇప్పుడు ఎంత సంపాదన ఉంది?
ఆటో డ్రైవర్: గతంలో రోజుకు 15 వందల నుంచి 2 వేల వరకు సంపాదించేవాళ్లం. కనీసం వెయ్యి తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు 300 దాటడం లేదు.
కేటీఆర్: ఇక్కడ ఎక్కడుంటావు?
ఆటో డ్రైవర్: మాది నాచారం సార్. పొద్దున ఇటువైపు ఓ ట్రిప్ ఉంటే వచ్చాను. ఇక్కడ మీటింగ్ జరుగుతుందని తెలుసుకొని ఎవ్వరైనా ఆటోలో ఎక్కుతారేమోనని వచ్చాను. చూస్తే మీరెక్కారు సార్ (ఇద్దరు నవ్వుతూ..) సార్.. పెద్ద సార్ ఆరోగ్యం ఎలా ఉంది?
కేటీఆర్: బాగుంది. మీ ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడారు. మీ సమస్యలపై మాట్లాడుతానని అన్నారు.
ఆటో డ్రైవర్: సార్.. కేసీఆర్‌ని కాంగ్రెసోళ్లు తిడుతుంటే కడుపు తరుక్కుపోతున్నది సార్?
కేటీఆర్: ఏ.. ఎందుకు?
ఆటో డ్రైవర్: ఎన్నో ఏండ్ల నుంచి కోరుకుంటున్న తెలంగాణను చావు నోట్లో తల పెట్టి తెచ్చాడు. అంతటి గొప్ప వ్యక్తిని ఎవ్వరైన ఏమైనా అంటే కోపమొస్తది సార్.
కేటీఆర్: డ్రైవర్ భుజం తడుతూ.. ఔను. విమర్శలను పట్టించుకుంటే మనం ముందుకెళ్లలేం. భవన్ వచ్చేసింది. ఇక్కడ ఆపు. మరో రోజు నువ్వు, నీ కుటుంబంతో కలిసి తెలంగాణభవన్‌కు వచ్చి నన్ను కలువు.
ఆటో డ్రైవర్: సార్.. తప్పకుండా. థ్యాంక్యూ సార్.
కేటీఆర్ సార్.. నా ఆటో ఎక్కడం అదృష్టం: ఆటో డ్రైవర్
ఆటో డ్రైవర్ శాతం రమేశ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్ సార్ నా ఆటోలో ఎక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆటోలో సార్ వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఉన్నారు. భవన్ చేరుకున్నాక కేటీఆర్ సార్ నాకు ఫోన్ నంబర్ ఇచ్చారు. భవన్‌కు వచ్చి ఫోన్ చేయమన్నారు. రూ.2,500 చేతిలో పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది’ అని పేర్కొన్నారు.