KTR | హైదరాబాద్ : రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా హైడ్రా చేసిన దారుణాలను వీడియో రూపంలో కేటీఆర్ చూపించారు. హైడ్రా పేదల కడుపు కొడుతూ, ఇండ్లు ఎలా కూలగొడుతుందో వీడియోలను ఎగ్జిబిషన్ రూపంలో చూపించారు. ఈ సందర్భంగా హైడ్రా బాధితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల ఇండ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయి. పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం కాదు అందరికి ఒకటే న్యాయమన్న హైడ్రా వీళ్ళ ఇండ్లు ఎందుకు కూల్చడం లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లనే ఇవాళ రేవంత్ రెడ్డి కూల్చేశాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇస్తే ఎవరో బిల్డర్ కోసం రేవంత్ రెడ్డి వాటిని కూల్చేశాడు. పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం ఉండదు.. అందరికీ ఒకటే న్యాయమన్న హైడ్రా.. చెరువులు కబ్జా చేసిన కట్టిన రేవంత్ సోదరుడు, పొంగులేటి, వివేక్, పట్నం మహేందర్ రెడ్డి ఇండ్లను ఎందుకు కూల్చడం లేదు? అని నిలదీశారు. వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తుందా? వాళ్లకు నోటీసులు ఇచ్చే దమ్ము హైడ్రా అధికారులకు ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది నిజంగానే ప్రజా పాలన అయితే.. కాంగ్రెస్ నాయకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. పెద్దల ఇండ్లను ఎందుకు కూల్చలేదు, కనీసం నోటీసులు అయినా ఎందుకు ఇవ్వలేదు? పేదల ఇండ్లను కూల్చే హైడ్రా చేసేది మంచే అయితే.. ఫైవ్ స్టార్ హోటళ్లల్లో మీటింగ్స్ పెట్టడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. గుడిసెలు వేసుకుంటే.. కూలగొట్టారు
దుర్గమ్మ శరణాలయం.. కూలగొట్టారు. కాగితాలు ఉన్న.. హైకోర్టు స్టే ఉన్నా.. ఇండ్లు కూలగొట్టారు అని కేటీఆర్ గుర్తు చేశారు. హైడ్రా బాధితులకు లీగల్ టీమ్ అండగా ఉంటుంది అని కేటీఆర్ భరోసానిచ్చారు.
500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది
హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తాం – కేటీఆర్ pic.twitter.com/pbCBqPFjmK
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2025