BRS Working President KTR | మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ .. 15 ఏండ్ల క్రితం తెలంగాణ కోసం ఉక్కు సంకల్పంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దీక్షకు దిగారని చెప్పారు. దీక్ష సఫలమైన ఈ రోజును విజయ్ దివస్గాజరుపుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచి పోతుందన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయం అని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతున్నదన్నారు. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహం అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమ కడలి మధనంలో తెలంగాణ తల్లి ఉద్బవించిందని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో భారత మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కాళోజీ నారాయణ రావు పొగిడారని చెప్పారు. దేవతా రూపంలో ఉన్న తల్లిని చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కృతి తెలంగాణదన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో కవులు, కళాకారులు, శిల్పుల సారధ్యంలో సమిష్టిగా ఆవిర్భవించింది తెలంగాణ తల్లి అని కేటీఆర్ పేర్కొన్నారు. చూడగానే చెయ్యెత్తి దండం పెట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం అని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని అవమానించిన వారికి ధీటుగా సమాధానమిస్తాం అని తెలిపారు. తెలంగాణకు ప్రత్యేకంగా చేతిలో బతుకమ్మతో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పారు. అంత గొప్ప తల్లిని ఈనాడు కాంగ్రెస్ పార్టీ సర్కార్ పేదరాలిని చేసిందన్నారు. తల్లులను మార్చే దుర్మార్గులు ప్రపచంలో ఎక్కడా ఉండరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి గానీ తల్లులు కాదన్నారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మను మాయం చేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మాయం చేయడమే అని అన్నారు.
సమిష్టిగా సాధించిన తెలంగాణను పదేండ్లలో దేశంలోనే అగ్రపథాన నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాంగ్రెస్ తల్లిని సకల మర్యాదలతో గాంధీభవన్’కు తరలిస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అపచారానికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం అని చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేద్దాం అని పిలుపునిచ్చారు.